అమెరికా న్యూ అర్లిన్ లో కాల్పులు

 

అమెరికాలో మళ్ళీ తుపాకుల మోత మారుమ్రోగింది. ఈసారి న్యూ ఆర్లిన్ లోని తొమ్మిదవ వార్డులో గల బన్నీ ఫ్రెండ్ పార్క్ వద్ద జరిగిన కాల్పులలో సుమారు 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పులలో సుమారు 10మంది వరకు చనిపోయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. గాయపడిన వారినందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లుస్థానిక పోలీస్ అధికార ప్రతినిధి టేలర్ గ్యాంబల్ తెలిపారు. ఇది స్థానికంగా ఉండే రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే తప్ప ఉగ్రవాదుల దాడి కాదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కాల్పులపై దర్యాప్తు మొదలుపెట్టమని తెలిపారు. 

 

స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి ఏడు గంటలకి ఆ పార్క్ లో ఒక మ్యూజిక్ వీడియో ఆల్బం షూటింగ్ జరుగుతోంది. దానిలో పాల్గొనేందుకు చాల మంది ప్రజలు తరలివచ్చేరు. అదే సమయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలయింది. చివరికి అది తుపాకీ కాల్పుల వరకు వెళ్లిందని సమాచారం.  ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయినప్పుడు ఆ పార్క్ లో సుమారు 300-500 మంది వరకు సామాన్య ప్రజలు ఉన్నారని, వారందరూ కాల్పుల శబ్దం విని భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.