కేసీఆర్ విచారం

 

తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా వున్నావారు వైఎస్సార్ బూట్లు నాకి మంత్రి పదవులు సంపాదించుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. చివరికి మంత్రి చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ విచారాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సభ్యులు, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి మధ్య వివాదం జరిగిన అనంతరం కేసీఆర్ సభకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... సభలో జరిగిన దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు. సభకు వచ్చి అసెంబ్లీ కార్యదర్శిని అడిగి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. మంత్రిగా ఉండి అలాంటి పదజాలం వాడకూడదని, సభను బాగా జరుపుకొంటున్నామని బయట అందరూ చెప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి అడిగిన ప్రశ్నలలో ఎలాంటి తప్పులేదని, నిజంగానే మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఆయన చెప్పిన దానిలో పూర్తి నిజం ఉందని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అనేక విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అన్నీ త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు.