టీడీపీ: త్యాగాలకు సరైన గుర్తింపు లభించాలి



త్వరలో హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్న సందర్భంగా జరిగే ఈ మహానాడును చాలా కీలకమైన మహానాడుగా భావించాల్సి వుంటుంది. ఈ మహానాడు జరిగేలోపలే ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న నామినేషన్ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తూ వుండటం తెలుగుదేశం నాయకులలో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. పదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ జెండాను భుజాన మోయడంతోపాటు ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకులకు మహానాడు లోపు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోలెడన్ని నామినేషన్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని తెలుగుదేశం క్యాడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి నియామకం ఈ పోస్టుల భర్తీకి శుభారంభం అని కేడర్ భావిస్తోంది. అలాగే రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు ఛైర్మన్లు, పాలక మండలి సభ్యులను త్వరలో నియమించబోతున్నారు. రాష్ట్రంలోని 109 మార్కెట్ కమిటీల్లో ఇప్పటి వరకు 51 కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి. మిగతా కమిటీలకు కూడా నియామకాలు పూర్తి చేయనున్నారు. పార్టీ కార్యక్రమాల కమిటీలు, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, అనేక కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయబోతున్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకులు ఎంతోమంది వున్నారు. వారు పార్టీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలకు సరైన గుర్తింపు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా లభించాలని వారు కోరుకుంటున్నారు. గత ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం, స్థానికంగా ప్రజాబలం ఉన్న కొంతమంది నాయకులు పార్టీ నుంచి టిక్కెట్ ఆశించారు. అయితే వివిధ రాజకీయ సమీకరణాల కారణంగా వాళ్ళు పోటీ నుంచి తప్పుకుని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం చిత్తశుద్ధిగా కృషి చేశారు. ఆ సమయంలో వారు చేసిన త్యాగం కారణంగానే పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవగలిగారు. ఆ నాయకులు చేసిన త్యాగాలే పదేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి సరైన ప్రాధాన్యం, సముచిత స్థానం ఇవ్వాలన్న అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం శ్రమించిన వారికి సరైన గౌరవం ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీకి మరింత మంచి పేరు తెస్తారని కార్యకర్తలు అంటున్నారు.

అయితే, ఇప్పటి వరకు పార్టీ కొన్ని పదవుల కోసం కొంతమందిని ఎంపిక చేసిన తీరు విషయంలో కార్యకర్తలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డు ఛైర్మన్ పోస్టును తెలంగాణకు చెందిన దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇస్తే బావుండేదని భావిస్తున్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం అనేది ఇప్పటికీ కొన్నిచోట్ల దురాచారంగా అమల్లో వుంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోనే ప్రముఖ దేవాలయం బోర్డు ఛైర్మన్‌గా ఒక దళితుడిని నియమిస్తే దాని ప్రభావం ఈ సమాజం మీద ఎంతో వుండేదని, దళితులకు ఒక మనోధైర్యం ఇచ్చినట్టు వుండేదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. అలాగే పార్టీకి ఎలాంటి సంబంధం లేని పరకాల ప్రభాకర్‌ని పార్టీ మీడియా సలహాదారుడిగా నియమించడం, ఎన్నారై కూచిభొట్ల ఆనంద్‌ని కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా ఎంపిక చేయడం, వేరే పార్టీ నుంచి వచ్చిన తిప్పేస్వామిని ఎమ్మెల్సీ చేయడం, గుడివాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం... ఇలాంటి వాటిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా దొర్లిన ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా పార్టీకోసం శ్రమించిన వారికి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుకుంటున్నారు.