ఒక్క ఐఏఎస్.. మూడు పదవులు...
posted on Dec 31, 2014 4:44PM

ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క పదవి అయితే సమర్థంగా నిర్వహిస్తారు. తనకు అప్పగించిన పదవీబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒకేసారి మూడు పదవులను అప్పగిస్తే ఏమవుతుంది? ఆ ఆఫీసర్ ఆ పదవులకు న్యాయం చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ ఆఫీసర్ తనకు అప్పగించిన బాధ్యతలను ఛాలెంజ్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ తనకు అప్పగించిన మూడు బాధ్యతలను అలా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిర్వర్తిస్తారని ఆశిద్దాం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్‌గా వున్నారు. ఒక వ్యక్తి రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేయడం అంటే అది తలకు మించిన భారమే అవుతుంది. అయితే ఆ రెండు బాధ్యతలను శ్రీధర్ ప్రశంసనీయంగా నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించారో ఏమోగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు శ్రీధర్ భుజస్కంధాల మీద మరో భారాన్ని మోపారు. అది సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత. ఇప్పటి వరకూ ఈ పదవిలో వున్న భట్టాచార్య కోల్ ఇండియా లిమిటెడ్ సీఎండీ బాధ్యతలను నిర్వర్తించడానికి బదిలీ అయి వెళ్ళారు. దాంతో ఏర్పడిన ఖాళీలో శ్రీధర్‌ని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ శ్రీధర్‌కి మంచి టార్గెట్ కూడా ఇచ్చారు. గతంలో కంటే ఉన్నతమైన స్థానికి సింగరేణి కాలరీస్ కంపెనీని తీసుకురావాలని కోరారు. మరి మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో చూడాలి.