రేవంత్ బెయిల్ విచారణ వాయిదా..

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసుపై వాదనలు వినిపించడానికి ఇంకా కొంత సమయం కావాలని.. మావద్ద కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అదనపు కౌంటర్ దాఖలు చేయాలని.. దానికి కొంత గడువుకావాలని ఏసీబీ కోరింది. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో వీడియో టేపులు ఇప్పటికే టెస్టు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన నివేదిక కూడా ఈ రోజే రానుంది. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య అరెస్ట్ పై స్టే కూడా ఈ రోజే ముగియనుంది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా బెయిల్ కోసం హోకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.