సహనం కోల్పోతున్న సిఎం...సమాధానమిస్తున్న బాబు!
posted on Nov 1, 2012 12:37PM
.png)
తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? అలానే అస్తమానూ సిఎం పదవికి ఇంకొకరిని ఎంపిక చేస్తారన్న వార్తలు చదివి చదివి ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విసిగిపోయారు. దీనికి తోడు సీనియర్ల అడ్డగోలు వ్యాఖ్యలు కూడా ఆయన్ని కలవరపరుస్తోంది. చివరికి మనిషి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఉన్నా రాష్ట్రంలో జరుగుతున్న మార్పులపైనే ఆయన దృష్టిసారిస్తున్నారు.
దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, ప్రసంగాలు ఆయన గమనిస్తున్నారు. ఇంకోవైపు వైకాపా నాయకురాలు షర్మిల చేసే వ్యాఖ్యలు కూడా పరిశీలిస్తున్నారు. షర్మిల వ్యాఖ్యానాలపై కాంగ్రెసు మహిళా నేతలకు ఆయన పని పెట్టారు. తాను మాత్రం చంద్రబాబుకు వస్తున్న స్పందన గమనించి ఆశ్చర్యపోయి ఆయనకు సమాధానం తానే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అందుకే చంద్రబాబు తన ప్రసంగంలో రైతులకు రుణమాఫీ అంశం ప్రస్తావించగానే సిఎం అదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బాబు ఏమాత్రం తడుముకోకుండా కాంగ్రెస్ వారి అవినీతి ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ అని సమాధానమిచ్చారు. ఊహించని ఈ సమాధానంతో కొంత ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫొటోల కోసం ఇందిరమ్మ బాట కాదు తాము అధికారంలోకి వస్తే నిజంగా రుణమాఫీని అమలు చేస్తామని బాబు రైతులకు భరోసా ఇచ్చారు.