కాటన్ ఆనకట్టని కూల్చేస్తారా?
posted on Nov 1, 2012 8:14AM
.png)
తరాలు మారినా చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుందనేది భారతీయవిశ్వాసం. అటువంటి విశ్వాసాలకు, నమ్మకాలకు, అభిమానాలకు అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా తిలోదకాలు ఇస్తుంటారు. అటువంటి ఘటనే ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద జరుగుతోంది.
గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ దొర నిర్మించిన ఆనకట్ట ఆయన్ని చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేసింది. 1850లో ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ నిర్మాణం వల్ల బీళ్లువారిన పొలాలు గోదావరి జలాలతో సస్యశ్యామలమయ్యాయి. అందుకే పిల్లల పాఠ్యపుస్తకాల్లోనూ కాటన్‌కు చోటిచ్చారు. అంతటి పురాతన కట్టడమైన దుమ్ముగూడెం ఆనకట్టను జల విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినా వాస్తవానికి ఈ కట్టడాన్ని కాపాడుకునేందుకు కేంద్రం జీఓ కూడా విడుదల చేసింది.
2008లో విడుదలైన ఈ జీఓ ప్రకారం కేంద్రం పురాతనకట్టడాలను తొలగించరాదని, వాటి బదులు కొత్త నిర్మాణాలు చేపట్టాలని స్పష్టంగా పేర్కొంది. ఈ అంశాన్ని విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు బేఖాతరు చేశారు. వీరిపై చర్యలు తీసుకునైనా కాటన్ నిర్మించిన ఆనకట్టను చారిత్రకచిహ్నంగా మిగల్చాలని స్థానికులు, చారిత్రకవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే తమ వ్యతిఏకతను వీరు విద్యుత్తు అధికారులకు తెలియజేశారు.