కేసీఆర్ ఒక మినీ మోడీ: రాహుల్ గాంధీ
posted on May 15, 2015 4:33PM
ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పడ్యాల్ గ్రామంలో రైతులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని జాతీయ మోడీ అయితే, కేసీఆర్ తెలంగాణాలో మినీ మోడీ అని ఆయన చమత్కరించారు. ఇద్దరూ కూడా దేశాన్ని, తెలంగాణా రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడమే తప్ప నిజంగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేసారు. ఇద్దరూ ప్రజలకి అనేక హామీలను ఇచ్చేరని కానీ వాటిలో ఏ ఒక్కదానిని వారు అమలు చేసి చూపలేకపోయారని ఆయన విమర్శించారు. మేక్ ఇన్ ఇండియాతో బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని మోడీ అన్నారని కానీ ఇంత వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, అదేవిధంగా తెలంగాణాలో కేసీఆర్ కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే నేనెందుకు వారిని పరామర్శించడానికి బయలుదేరానని వారు ప్రశ్నిస్తున్నారని నాకు తెలిసింది. కానీ రైతులు కష్ట కాలంలో ఉన్నప్పుడు మోడీ కానీ కేసీఆర్ గానీ స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి, వారికి అండగా నిలబడితే నేను వెళ్ళవలసిన పనేముంటుంది? వారిరువురూ రైతులను పట్టించుకోలేదు కనుకనే నేను రైతుల కోసం బయలుదేరవలసి వచ్చింది,” అని అన్నారు.
అయితే, ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ జిల్లాలో కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే కేవలం ఓ నలుగురిని మాత్రమే ఎందుకు కలిసారు? మిగిలినవారిని ఎందుకు కలవలేదు? అని ప్రశ్నించుకొంటే ఆయనకే సమాధానం దొరుకుతుంది.
లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఒక జిల్లాలో పర్యటన చేసినప్పుడు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలందరినీ పరామర్శించలేనప్పుడు, వారికి ఆర్ధిక సహాయం చేయలేనప్పుడు, ఇక ఇంత సువిశాలమయిన భారత దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ, తెలంగాణాను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆత్మహత్యలు చేసుకొన్న ప్రతీ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించి, వారికి సహాయం చేయగలరని రాహుల్ గాంధీ ఏవిధంగా భావిస్తున్నారు? అటువంటి సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు, యంత్రాంగం ఉంది. వారిని, ఆ యంత్రాంగాన్ని సరిగ్గా నడిచేలా చేయడమే వారి బాధ్యత తప్ప నేరుగా వెళ్లి దేశంలో ప్రతీ రైతును పలకరించి ఓదార్చడం కాదు వారి పని.
ఇక ఉద్యోగాల విషయానికి వస్తే గత పదేళ్ళుగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలియదు కానీ ఇంకా ఏడాది తిరక్క ముందే మోడీ, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలని రాహుల్ ఆశించడం కూడా హాస్యాస్పదమే. ఒక సంస్థ స్థాపించడానికే కనీసం ఒకటి రెండేళ్ళ కాలం పడుతుంది.
మేక్ ఇన్ ఇండియా పధకం మొదలుపెట్టి ఇంకా ఆరునెలలు కూడా కాలేదు. అదే విధంగా తెలంగాణాలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తోందనే విషయం కాంగ్రెస్ నేతలకు కనబడకపోవచ్చును. కానీ ప్రజలందరికీ కనబడుతోంది. అటువంటప్పుడు ఉద్యోగ కల్పనకు మరి కొంత సమయం పడుతుందనే సంగతి రాహుల్ గాంధీకి తెలియదనుకోవాలా లేక తెలిసీ ప్రజలను తన మాటలతో తెలివిగా త్రప్పు ద్రోవ పట్టిస్తున్నారనుకోవాలా?