కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి యువరాజా వారు వచ్చేశారు
posted on Apr 17, 2015 2:44PM
సుమారు రెండు నెలలుగా అదృశ్యమయిపోయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తిరిగి వచ్చేరు. పార్టీని ఏవిధంగా ముందుకు నడిపించాలి? అందుకు ఎటువంటి విధానాలు అవలంభించాలి? వంటి ముఖ్యమయిన విషయాల గురించి ఆలోచించేందుకు ఆయన రెండు వారాలు ‘రాజకీయాలకు శలవు’ తీసుకొని వెళ్ళారని కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకొంది. పార్టీ ఉపాధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఒకవేళ పార్టీ గురించి ఆలోచించదలిస్తే పార్టీలో ముఖ్య నేతలతో కలిసి కూర్చొని ఆలోచించాలి. కానీ ఆయన ఉరుగ్వే, మయన్మార్, తాయ్ ల్యాండ్ దేశాలలో ఒంటరిగా చక్కర్లు కొట్టి వచ్చేరు. దానితో ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రతిపక్షాలకు ఆయన శలవు గురించి కాకమ్మ కధలు చెప్పిందని స్పష్టమయింది.
ఆయన డిల్లీకి తిరిగి రాక ముందే కాంగ్రెస్ నేతల మాటలలోనే అసలు విషయం బయటపడింది. పార్టీలో సీనియర్ల వైఖరి, వారు (తనను పక్కనబెట్టి) పార్టీని నడిపిస్తున్నతీరు చూసి అలిగి శలవు తీసుకొన్నారని కాంగ్రెస్ నేతలే పరోక్షంగా చెప్పుకొన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆయనకీ మధ్య కూడా అనేక విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి వారే చెప్పుకొన్నారు. అయితే అది కేవలం తరాల అంతరం (జనరేషన్ గ్యాప్) మాత్రమేనని మళ్ళీ వారే కలరింగ్ ఇచ్చుకొన్నారు.
అదే విధంగా ఆయన శలవు మీద వెళ్లినప్పటి నుండి తిరిగి వచ్చేవరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఆయన నాయకత్వ లక్షణాలు, సమర్ధత గురించే చర్చ జరగడం చూస్తే ఆ పార్టీకి ప్రధాన సమస్య రాహుల్ గాంధీయేనని వారు భావిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఆ కారణంగానే కొందరు సోనియాగాంధీ గ్రూపుగా మరికొందరు రాహుల్ గాంధీ గ్రూపుగా తయారయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ముఠాలు కట్టడం కొత్తేమీ కాదు. కానీ ఏకంగా పార్టీని నడిపిస్తున్న ఆ తల్లి కొడుకులకే రెండు ముఠాలు తయారవడం విచిత్రం. ఇటువంటి విచిత్రం మరే పార్టీలో కనబడదు.
ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ, తన పార్టీని ఏవిధంగా బ్రతికించుకోవాలా...అని ఆలోచించే బదులు, ఏవిధంగా పార్టీని తన అదుపులోకి తీసుకోవాలా...అని ఆలోచించడమే వింత. ఆయన తన నాయకత్వ లక్షణాలు, సమర్ధతను నిరూపించుకోగలిగి ఉండి ఉంటే ఆయన పార్టీ మీద పట్టు సాధించేందుకు ఈవిధంగా శలవు తీసుకోవలసిన అవసరం ఉండేది కాదు.
ఒకప్పుడు మారుమూల గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, అరవై ఏళ్లగా సాధించలేని తెలంగాణాను కేవలం పదేళ్ళలో సాధించిన కేసీఆర్, పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగిన చంద్రబాబు నాయుడు, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ యన్టీఆర్, రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్యూనిష్టుల కంచుకోటను బ్రద్దలు కొట్టిన వీర నారీమణి మమతా బెనర్జీ, కొమ్ములు తిరిగిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిపించిన అరవింద్ కేజ్రీవాల్ వంటి వారందరూ తమ నాయకత్వ లక్షాణాల వలననే పార్టీపై పూర్తి పట్టు సాధించారు తప్ప రాహుల్ గాంధీలాగ ఎక్కడికో పారిపోయి పార్టీపై పట్టు సాధించాలనుకోలేదు.
మోడీ, చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారందరూ తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో సైతం ఏ మాత్రం నిబ్బరం కోల్పోకుండా పార్టీని ఒక్క త్రాటిపై ముందుకు నడిపించి విజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. కానీ రాహుల్ గాంధీకి ఆయన తల్లి సోనియా గాంధీ అన్నీ విస్తర్లో వడ్డించి అందజేసినా అందుకోలేకపోయారు. చివరికి డా. మన్మోహన్ సింగ్ అంతటివాడి చేత ఆయన కోసం ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ చేయించడానికి కూడా ఆమె సిద్దపడినా రాహుల్ గాంధీ అందులో కూర్చోవడానికి భయపడ్డారు.
ఈరోజు పార్టీ పగ్గాలు తనకే దక్కాలని కోరుకొంటున్న రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ పగ్గాలు అందుకొని ఉండి ఉంటే, పార్టీ ఓడిపోయినా అందరూ ఆయన వెంటే ఉండేవారు. కనీసం లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆయన దైర్యం చేయలేక హాయిగా వెనుక బెంచీలలో కునుకు తీసారు. అటువంటి వ్యక్తిపై ప్రజలకే కాదు పార్టీలో నేతలకయినా ఎందుకు నమ్మకం కలుగుతుంది? అయితే ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో నేతలు వ్యతిరేకించవచ్చునేమో గానీ బీజేపీతో సహా దేశంలో మరే ఇతర పార్టీ వ్యతిరేకించదు. ఎందుకంటే తమ పార్టీలు పదికాలాలపాటు చల్లగా అధికారంలో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆయనే నాయకుడిగా ఉండాలని వారు ఆశపడటం సహజమే.
నెహ్రు కుటుంబంలో పుట్టడం ఒక్కటే తనకున్న ఏకైక అదనపు అర్హత అని రాహుల్ గాంధీయే ఒకప్పుడు స్వయంగా చెప్పుకొన్నారు. మరి ఇప్పుడు ఆయన అదే ప్రత్యేక అర్హతతోనే కాంగ్రెస్ పార్టీపై పెత్తనం చేయాలని ఎందుకు భావిస్తున్నట్లు? గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని కుర్చీలో, పార్టీ అధ్యక్ష కుర్చీలో కూర్చోవడానికి తనకు తగిన అర్హత లేదని జంకిన వ్యక్తి, ఇప్పుడు హటాత్తుగా పార్టీకి సారధ్యం వహించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారు? ఆయన నాయకత్వ లక్షణాలను సమర్ధతను పార్టీలో నేతలే ప్రశ్నిస్తున్నప్పుడు, తను మిగిలిన సీనియర్ల కంటే ఏవిధంగా సమర్ధుడని ఆయన భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నది ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే అడుగుతున్నారు. ఏమయినప్పటికీ ఇన్ని అవకాశాలు వచ్చినా తన సమర్ధతను నిరూపించుకోలేక రాజకీయాలకు శలవు పెట్టిన వ్యక్తి చేతిలో కాంగ్రెస్ పార్టీని పెడితే ఏమవుతుందో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవలసి ఉంటుంది.