పోలవరం కోసం ఇంత ఆవేదన...మరెవరికీ లేదేమో

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తన పార్టీ యం.యల్యే.లతో కలిసి మూడు రోజుల బస్సు యాత్రకు బయలుదేరారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలో పర్యటించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఏడాదికి రూ.4000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చును. కానీ ఈ పది నెలల కాలంలో ప్రభుత్వం దానిమీద కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకే పోలవరం ప్రాజెక్టుని పక్కనబెట్టారు,” అని విమర్శించారు.

 

గత పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని పరిపాలించింది. అందులో ఐదేళ్ళపాటు రాజశేఖర్ రెడ్డే స్వయంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఆయనకు కేంద్రం వద్ద మంచి పలుకుబడి ఉండేది కూడా. అయినా ఆయన పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేయలేకపోయారు. జలయజ్ఞం పేరిట వేల కోట్ల రూపాయలు ఆయన హయంలోనే ఖర్చు చేసారు. కానీ పోలవరం ప్రాజెక్టుతో సహా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏడాదికి రూ.4,000 కోట్లు ఖర్చు చేయగలిగితే చాలు...నాలుగేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని జగన్మోహన్ రెడ్డి అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు మరి అదే విషయం తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి చెప్పి ఆయన హయాంలోనే పూర్తి చేయించి ఉండవచ్చును. లేదా ఆయన తరువాత పరిపాలించిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ వహిస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి భావించి ఉండి ఉంటే అప్పుడూ ఇదేవిధంగా బస్సు యాత్రలు, ధర్నాలు చేసి వారిపై ఒత్తిడి చేసి ఉండవచ్చును. కానీ అప్పుడు ఓదార్పు యాత్రలతో కాలక్షేపం చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి తెగ ఆవేదన పడిపోవడమే విచిత్రంగా ఉంది. పైగా వచ్చే ఎన్నికలలోగా ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులలో పూర్తి చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నప్పటికీ, దానిని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు గుప్పించడం ఎందుకు? ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయలేకపోతే అప్పుడు నిలదీసినా అర్ధం ఉంటుంది. కానీ పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుకుగా చర్యలు చేపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈవిధంగా ఆరోపణలు గుప్పించడం కేవలం రాజకీయ లబ్ది కోసమేనని భావించవలసి ఉంటుంది.

 

పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేనప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం చేప్పట్టి ఇంకా ఏడాది కూడా పూర్తికాక ముందే ప్రాజెక్టుని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించడం అవివేకం.

 

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తమే. అదే నిజమయితే ఆ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వందల కోట్ల సొమ్ముని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీ-ఇంబర్స్ చేస్తోంది?

 

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయిన తరువాత నుండే ఈ పోలవరం గురించి చర్చ మొదలయ్యింది. పనులు కూడా వేగవంతం అయ్యాయనే విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వాలు మారిన తరువాతనే రాష్ట్రాభివృద్ధి గురించి అనేక ఆలోచనలు, ప్రణాళికలు, కార్యక్రమాలు, నిధులు మంజూరు అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అనేక ఇతర అబివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇవేవీ కనిపించకపోవడం విచిత్రమే.

 

జగన్ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లున్నారు తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనే తపన మాత్రం ఆయనలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.