పాముకు పాలు పోసినా కాటేస్తుంది

 

ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు ఉగ్రవాదానికి బలవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ వంటి దేశాలు భయంకరమయిన విషసర్పాల వంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తునే ఉన్నాయి. పాము తన పిల్లలను తానే చంపి తిన్నట్లుగా వారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు చివరికి వారి పిల్లలను, ప్రజలనే అతి కిరాతకంగా చంపుతున్నారు. అయినా పాక్ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ నిర్వాకానికి భారత్ కూడా మూల్యం చెల్లించవలసిరావడం ప్రతీ భారతీయుడికి చాలా కష్టం అనిపిస్తుంది.

 

పాకిస్తాన్ నిర్వాకం ఎలా ఉన్నా రెండు నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కూడా సరిగా అటువంటి నిర్వాకమే చేస్తూ భారత్ కు మరిన్ని కొత్త సమస్యలు, సవాళ్ళు, కష్టాలు తెచ్చిపెడుతున్నారిప్పుడు.

 

కాశ్మీర్ వేర్పాటు వాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ పై దయ తలచబట్టే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకోగలిగామని ప్రకటించిన ఆయన అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకొన్నారు. అధికారం చేప్పట్టి నెల తిరుగక ముందే మసరత్ ఆలం అనే కరడుగట్టిన వేర్పాటువాదిని మూడో కంటికి తెలియకుండా జైలు నుండి విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు.

 

అతను నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లో ఒక భారీ ర్యాలీ, బహిరంగ సభను ఏర్పాటు చేసి అందులో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించారు. అంతకు ముందు రోజే ఆయన ఆక్రమిత కాశ్మీర్ నుండి ప్రసారమవుతున్న ఒక రేడియో చానల్ ద్వారా భారత వ్యతిరేక ప్రసంగం చేసారు కూడా.

 

కాశ్మీర్ వేర్పాటువాదిగా పేరుమోసిన సయీద్ గిలానీ డిల్లీలో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని శ్రీనగర్ తిరిగి వస్తున సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు మసరత్ ఆలం ఆ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడం, అందులో పాకిస్తాన్ జెండాలను ఎగురవేసినా ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కు అందులో ఎటువంటి తప్పు కనిపించలేదు. చివరికి నిరసనకారులు భారత జెండాను బహిరంగంగా తగులబెట్టినా ఆయనకు అందులో తప్పేమీ కనబడలేదు. అది విభిన్న వ్యక్తుల భిన్నాభిప్రాయాలకు ప్రతీక అని సర్దిచెప్పుకొన్నారు.

 

కానీ ఆయన తన తీరు మార్చుకోకపోతే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని బీజేపీ గట్టిగా హెచ్చరించడం, కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి గట్టిగా మందలించిన తరువాతనే ఆయన భారత్ కు వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న మసరత్ ఆలం, గిలానీలని అరెస్ట్ చేయించారు. కానీ వారిలో గిలానిని మాత్రం జైలుకి తరలించకుండా గృహ నిర్బంధంలోనే ఉంచారు. అంటే ఆయనకి ఇప్పటికీ స్వేచ్చ ఉన్నట్లే భావించవచ్చును.

 

మసరత్ ఆలంని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళుతున్నప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలు వేర్పాటువాద సంస్థ హురియత్ నేతృత్వంలో తమ పోరాటాలు కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

శ్రీనగర్ కి సుమారు 50కిమీ దూరంలో పుల్వామా జిల్లాలోగల ట్రాల్ పట్టణంలో వారం రోజుల క్రితం భద్రత దళాలకి ఉగ్రవాదులకి మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. అందులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. కానీ చనిపోయిన వారిరురువూ సామాన్య పౌరులేనని, కనుక వారిని ఎన్కౌంటర్ చేసిన భద్రతా దళాలపై కేసు నమోదు చేయాలని, కాశ్మీర్ లోయ నుండి భారత భద్రతా దళాలను తక్షణమే ఉపసంహరించాలని మసరత్ ఆలం ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. గత మూడు నాలుగు రోజులుగా నౌహట్ట మరియు ట్రాల్ ప్రాంతాలలో ప్రజలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తూ తమను అడ్డుకొంటున్న భద్రత దళాలపై రాళ్ళు రువ్వుతున్నారు. వారి దాడిలో భద్రత దళాలకు చెందిన 29 మంది గాయపడ్డారు. గత నాలుగయిదు రోజులుగా నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్ళు రువ్వడం, వారిని నిలువరించేందుకు భద్రతా దళాలు తిరిగి వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో శ్రీనగర్ ప్రాంతం అట్టుడుకుతోంది.

 

క్రమంగా జమ్మూ కాశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్ళీ తిరుగుబాటు, అల్లర్లు, హింస మోదలయ్యాయి. దీనికంతటికీ కారణం ఎవరు? ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, అయన చేసిన నిర్వాకమేనని చెప్పక తప్పదు. అతనిని విడుదల చేయడం వలన రాష్ర్టంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతాయని ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని సమర్ధించుకొన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గతంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయిన మసరత్ ఆలంని జైలు నుండి విడుదల చేసిన తరువాతనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ సమస్యలు మొదలయ్యాయి.

 

భారత గడ్డపై ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న అటువంటి ముఖ్యమంత్రికి, అయన ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇవ్వడం ఆ ప్రభుత్వంలో అధికారం పంచుకోవడం ఎంతవరకు సమంజసమో బీజేపీయే ఆలోచించుకోవాలి. దాని వలన మున్ముందు జరుగరానిది ఏదయినా జరిగినట్లయితే అందరూ బీజేపీనే నిందించకమానరు. చేతులు కాలే వరకు వేచి చూడటం కంటే, అటువంటి ప్రమాదం పొంచి ఉందని తెలిసి ఉన్నప్పుడు ముందే దానిని నివారించే ప్రయత్నం చేస్తే మంచిది కదా.