పి.ఎస్.ఎల్.వి సి-30 శాటిలైట్ విజయవంతం
posted on Sep 28, 2015 8:15AM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈరోజు ఉదయం 10 గంటలకి శ్రీహరికోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి సి-30 విజయవంతం అయ్యింది. భారత్ కి చెందిన ఆస్ట్రో శాట్ తో బాటు విదేశాలకు చెందినా మరో ఆరు ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా ఇస్రో శాస్త్రజ్ఞులు నిరేశిత కక్ష్యలోకి విజవంతంగా ప్రవేశపెట్టగలిగారు.
ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రజ్ఞులు సుమారు పదేళ్ళపాటు నిర్విరామంగా శ్రమించారు. 1513 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం కేవలం ఖగోళ పరిశోధనలు మాత్రమే వినియోగిస్తారు. అందుకోసం ఈ ఉపగ్రహంలో అత్యాధునిక అల్ట్రా వయొలెట్ టెలిస్కోపులు, ఇమేజేర్స్, మానిటర్ వంటి పరికరాలను అమర్చారు. బ్లాక్ హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం, నక్షత్రాల ఆవిర్భావం వంటి వాటి గురించి ఈ ఉపగ్రహం ద్వారా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు సేవలు అందిస్తుంది.
ఇది ఖగోళ పరిశోధనలకే పరిమితమయిన ప్రయోగం అయినప్పటికీ, ఇండోనేషియా, కెనడా, అమెరికా లకు చెందిన మొత్తం ఆరు విదేశీ ఉపగ్రహాలను కూడా పి.ఎస్.ఎల్.వి సి-30 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నారు. ఆయా దేశాల నుండి ఫీజు రూపేణా చాలా భారీ మొత్తం అందుతుంది కనుక ఈ ప్రయోగం కోసం చేసిన కొంత ఖర్చును భారత్ తిరిగి రాబట్టుకొన్నయింది. ఇంతవరకు ఇస్రో మొత్తం 50 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది. ఇంతకు ముందు కూడా భారత్ ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది మళ్ళీ మూడవసారి.