కాశ్మీర్ చేరుకున్న మోడీ

 

దీపావళి రోజంతా కాశ్మీర్ ప్రజలతో గడపాలని నిర్ణయించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొదట సియాచిన్‌కి చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆయన అక్కడ సైనికులతో గడుపుతారు. గత పదేళ్ళలో సియాచిన్ ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్రమోడీనే కావడం విశేషం. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా మోడీతోపాటు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం నుంచి మోడీ అనేక ట్విట్లు చేశారు. తాను సియాచిన్ గ్లేసియర్‌కి వెళ్తున్నానని, ఎంతో ముఖ్యమైన ఈరోజును కాశ్మీర్‌లో గడపగలగటం తన అదృష్టమని మోడీ పేర్కొన్నారు. విపత్కర వాతావరణ పరిస్థితుల్లో కూడా దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ విధులను నిర్వర్తిస్తున్న సైనికులు ఎంతో సాహసవంతులని ఆయన అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ట్విట్టర్లో స్పందించారు. దీపావళి రోజున ప్రధాని కాశ్మీర్‌లో గడపటానికి రావడం అభినందనీయమన్నారు.