ఫోన్ ట్యాపింగ్ ట్విస్ట్..

 

ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పుటికే ఈవిషయంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాల్ డేటా ఇవ్వడానికి నిరాకరించి.. కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని.. కాల్ డేటా ఇవ్వద్దన్నదని.. కేంద్రం కూడా సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని ఏవేవో కబుర్లు చెప్పింది. కాని విజయవాడ కోర్టు మాత్రం పాలన వేరు.. చట్టాలు వేరని కాల్ డేటా ఇవ్వాల్సిందేనని.. సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు అక్కడితో ఆగారా అంటే లేదు విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాని అక్కడ కూడా వాళ్లకు చుక్కెదురై కాల్ డేటా ఇవ్వాల్సిందేనని సర్వీసు ప్రొవైడర్లును ఆదేశించింది. దీంతో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటా ఇచ్చేందుకు గడువు కోరింది.

 

ఇక్కడి వరకు బానే ఉన్నా ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వడానికి తిరకాసుపెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ప్రతులు ఇవ్వాలనడం న్యాయసమ్మతం కాదని.. ఈ విషయంలో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఆపరేటర్ల నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. దర్యాఫ్తు సంస్థలు వివరాలు కోరినప్పుడు అందజేయాలని, అలా అందజేసిన సమాచారాన్ని తమ వద్ద ఉంచుకోరాదన్నారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ, టెలికాం మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఏపీ సిట్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ తదితరులను పేర్కొన్నారు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజంగా ఫోన్లు ట్యాపింగ్ చేయనపుడు కాల్ డేటా ఇవ్వడానికి ఎందుకు నాటకాలు ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.