నేపాల్‌తో ఈ వెటకారాలేంటి?
posted on May 1, 2015 12:14PM
నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఆ దేశం ఎప్పటికి కోలుకుంటుందో ఊహించడానికి కూడా వీల్లేనంతగా నష్టపోయింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వేలను దాటింది. ఈ సంఖ్య పదివేలను దాటే ప్రమాదం వుందని అధికారవర్గాలు చెబుతూ వుంటే, ఆ సంఖ్య పదిహేను వేలను కూడా చేరే ప్రమాదం వుందని పరిశీకులు భావిస్తున్నారు. ఇలాంటి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరైనా స్పందించి నేపాల్‌కి అందించాల్సింది ఆహారం, ఆసరా, మేమున్నామనే భరోసా. ఈ విషయంలో అనేక దేశాలు ముందడుగు వేసి నేపాల్‌ని ఆదుకుంటూ వుండటం అభినందనీయమైన విషయం. అయితే పాలకుండలో విషపు బొట్టుల్లాంటి కొన్ని ఘటనలు కూడా జరుగుతూ ఆ ఘటనలకు కారణమైన వాళ్ళు మనుషులేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ వున్నాయి. ఈమధ్య వేలంవెర్రిలా మారిన సెల్ఫీల పిచ్చి నేపాల్‌లో కూడా ముదిరినట్టుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంతో తమ ఆస్తులను, ఆప్తులను కోల్పోయి గుండెలు అవిసేలా రోదించే వారు లక్షల మంది వుంటే, భూకంప శిథిలాల దగ్గర నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్న వారిని ఏమనాలి? ఇది ఒక ఉదాహరణ అయితే, ఇంతకంటే దారుణమైన ఉదాహరణలు మరికొన్ని వున్నాయి.
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతోకానీ పోదని అంటారు.. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి అలాగే వుంది. తన ఇల్లు చక్కదిద్దుకోవడం తెలియని పాకిస్థాన్ ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటూముందుకు వచ్చింది. నేపాల్ భూకంప బాధితులకు తనవంతు సహాయంగా కొన్ని ఆహార పదార్ధాలను పంపింది. ఆ పదార్ధాలను చూసి నేపాల్ వాసులు నోళ్లు తెరిచారు. ఆకలికి చచ్చిపోయినా పర్లేదుగానీ, వీటిని తినమని చెప్పేశారు. పాకిస్థాన్ విమానాల నిండుగా పంపిన గొడ్డుమాంసాన్ని వాళ్ళు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. హిందూ దేశమైన నేపాల్లో గొడ్డుమాంసం ముట్టుకోరు. అలాంటి నేపాల్‌కి ఏరికోరి గొడ్డుమాంసమే పంపిన పాకిస్థాన్‌ని ఏమనాలంటారు?
ఇక గిడియన్స్ అనే క్రైస్తవ సంస్థ తీరు మరీ విచిత్రం. గిడియన్స్ సంస్థ నేపాల్ భూకంప బాధితుల విషయంలో వ్యవహరించిన తీరు చూసి క్రైస్తవులే తప్పు పడుతున్నారు. గిడియన్స్ సంస్థ నేపాల్‌కి పంపించిన విమానంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా లక్ష బైబిళ్ళు వున్నాయి. బైబిళ్ళు తప్ప విమానంలో మరేమీ రాలేదు. ఇది నేపాల్ వాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆహారం, బట్టలు పంపించాల్సిన నేపాల్‌కి ఈ సమయంలో బైబిళ్ళు పంపడమేంటి... అది కూడా ఒక హిందూ దేశానికి! ఈ అతి తెలివితేటల్ని ఏమనాలి? హిందూ దేశమైన నేపాల్‌లో క్రైస్తవ మతాన్ని బాగా వ్యాప్తిలోకి తేవాలన్నది గిడియన్స్ ఉద్దేశం. దీనికోసం ఆ సంస్థ ఇప్పటికే తనవంతు కృషి చేస్తోంది. ఇప్పుడు భూకంపం రూపంలో వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి బైబిళ్ళు పంపించింది. దీనికి నేపాల్ ప్రధాని ఘాటుగానే స్పందించారు. మేం బైబిళ్ళు తినం అని ఆయన స్పష్టంగా చెప్పారు. గిడియన్స్ సంస్థ చేసిన పనిని ప్రపంచమంతా విమర్శిస్తుంటే, మన తెలుగు మీడియా సంస్థలో మాత్రం నేపాల్‌లో క్రైస్తవులను నిరాదరించడం వల్లే భూకంపం వచ్చిందని అన్యాపదేశంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాళ్ళను చూస్తున్నప్పుడే మానవత్వం మీద నమ్మకం సడలుతూ వుంటుంది.