తెదేపాకి వ్యతిరేకంగా మరో మైండ్ గేమ్ మొదలయిందా?

 

ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెదేపాను మానసికంగా మరింత దెబ్బ తీసేందుకు మీడియాలో ఒక వర్గం తెదేపాకు వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు త్వరలో పార్టీని వీడవబోతున్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించేందుకు కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తానని లేకుంటే రాజ్యసభ సభ్యత్వమయినా ఇప్పిస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనకు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఆ హామీలను నిలబెట్టుకోకపోవడంతో మోత్కుపల్లి చాలా అసంతృప్తిగా ఉన్నారని అందుకే తెదేపాను వీడాలనుకొంటున్నట్లు మీడియాలో ప్రచారం మొదలయింది.

 

రాజకీయ పార్టీలు మైండ్ గేమ్స్ ఆడుకోవడం ఇప్పుడు సర్వసధారణమయిన విషయమే. కానీ వాటికి అనుబంధ మీడియా కూడా వంతపాడుతూ విస్త్రుత ప్రచారం చేస్తుండటంతో సామాన్య ప్రజలకు ఏది నిజమో ఏది కల్పితవార్తలో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. మోత్కుపల్లి నరసింహులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలను ఖండించకపోతే ప్రజలు అవే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది కనుక బహుశః ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన చేయవచ్చును.