నిశ్చితార్థం.. పెళ్ళి.. ఆ ముచ్చటే వేరు...
posted on Nov 27, 2014 1:39PM
పెళ్ళి అనగానే ఒక వేడుక - సంబరం - ఎన్నెన్నో ఆచారాలు - సంప్రదాయాలు - ఇవన్నీ కూడా ఒకో ప్రాంతానికి ఒకో రకంగా వుంటాయి. ముందుగా మన తెలుగువారి నిశ్చితార్థం గురించి చెప్పుకోవాలంటే... తాంబూలాలని, పసుపు కుంకుమలు పెట్టుకోవడం, పూలు, పళ్ళు ఇచ్చుకోవటం ఇలా రకరకాలుగా పిలుస్తారు ఆ సంబరాన్ని. ఉంగరాలు, వస్త్రాలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివాహ ముహూర్తాన్ని నిర్ణయించి లగ్న పత్రికలు రాసుకుంటారు. విందుతో కార్యక్రమం ముగుస్తుంది. దీనికి తోడు అదనంగా వేడుకలు సరేసరి.
బెంగాలీల నిశ్చితార్థం వేడుకలు సంబరంగా సాగిపోతాయి. ‘‘ఆశీర్వాద్’’గా పిలిచే బెంగాలీల ఎంగేజ్‌మెంట్‌ను పెళ్ళంత వైభవంగా జరుపుతారు. పెళ్ళికి 5 రోజుల ముందు పెళ్ళికూతురు కుటుంబం పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలాగే పెళ్ళికొడుకుకి బంగారం ఇతర బహుమతులు ఇస్తారు. ఆడపెళ్ళివారు ఇక వీరి పెళ్ళి వేడుకలో సింధూర్ దాన్ ఓ ప్రత్యేకత కలిగిన వేడుక. అత్యంత శుభప్రదమైన ఎర్ర కుంకుమని స్త్రీధనంగా ఇస్తారు. పెద్ద డబ్బా నిండా కుంకుమను నింపి వధువుకి అందిస్తారు. ఈ సింధూర్ దాన్‌లో ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు విలువైన బహుమతులు ఇస్తారు.
సింధీలు కొబ్బరి బోండాలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని ‘కచ్చిమిశ్రీ’గా పిలుస్తారు. వేడుకలు ఘనంగా జరుపుతారు. ఇక వీరి పెళ్ళిలో ‘సిజ’ అని పిలిచే ఆచారంలో స్త్రీధనంగా మంచం, పరుపు, దిండ్లువంటివన్నీ ఇస్తారు. ఇక పంజాబీల విషయానికి వస్తే నిశ్చితార్థాన్ని వారు ‘రోక’ అంటారు. వివాహం జరగబోయే తేదీని ప్రకటిస్తారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి నగలు, వస్త్రాలు, మేకప్ కిట్, ఆటబొమ్మలు వంటివి కానుకలుగా అందిస్తారు. అలాగే అబ్బాయికి కూడా అమ్మాయి తరఫు వారు అనేక బహుమతులు ఇస్తారు. ఇక వీరి పెళ్ళి వేడుకలో వధువుకు కొత్త కాపురానికి కావలసివన్నీ సమకూరుస్తారు ఆమె తల్లిదండ్రులు.
మిజోరాం ప్రాంతీయుల పెళ్ళిలో వరుడు తనకు కాబోయే భార్యకు స్త్రీధనం ఇస్తాడు. పెళ్ళిరోజున అమ్మాయి తండ్రికి దానిని అందించడం ఆచారం. ఇక గోవా వాసులు అమ్మాయికి పెళ్ళిలో ఇచ్చే అన్ని వస్తువులనూ ఏడేడు చొప్పున ఇస్తారు. అలాగే ఎక్కువగా వస్త్రాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. కొంతమంది ఆర్థిక స్తోమతని అనుసరించి ఇంటికి కావల్సిన వస్తువులని కూడా సమకూరుస్తారు.
‘సాంచ్’ పేరుతో గుజరాతీలు చేసే వేడుకలో అందమైన చుక్కల చుక్కల చాందినీ వస్త్రంతో ఓ పెద్ద సంచిని, దానితోపాటు మరో చిన్న సంచిని వధువుకు ఇస్తారు వీరు. అమ్మాయికి ఇచ్చే వస్తువులన్నీ ఆ సంచిలో పెట్టాలి. అది పూర్తిగా నిండాలి. ఇంటికి సంబంధించిన వస్తువులు పెడతారు దాన్లో. ఇక చిన్ సంచిని ‘కల్చీ’ అంటారు. వధువు తన భర్త కోసం స్వంతంగా డిజైన్ చేసుకునే సంచి అది. దీని నిండా రకరకాల పిండివంటలు వుంటాయి. ఇక పెళ్ళి సమయంలో ప్రత్యేకంగా కన్యాప్రదాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జైన్ల ఆచారం. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు లేదా మేనమామ ఆమె కుడిచేతిలో బియ్యం, రూపాయి పావలా డబ్బు ఉంచుతారు. మంత్రోచ్ఛారణతో తమ అమ్మాయిని వరుడికి అప్పగిస్తారు. ఆ తర్వాత పుట్టింటివారితోపాటు వరుడు కూడా వధువుకి కానుకలు ఇస్తాడు.
....రమ ఇరగవరపు