ఇలా చేస్తే స్నేహం పదిలం.. పదిలం...
posted on Aug 5, 2023 9:30AM
ఒకసారి ఇద్దరు స్నేహితులు చాలా దూరం కలసి ప్రయాణం చేయాల్సివచ్చింది. అడవులు, ఎడారులు, మైదానాలు, కొండలు, గుట్టలు... ఇలా వారి ప్రయాణం సాగింది. ఇద్దరూ ఎంతో ప్రాణస్నేహితులు. ఈ ప్రయాణంలో కాలక్షేపానికి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. ఒకోసారి కొన్ని విషయాలపై ఇద్దరికి అభిప్రాయం కలవక తీవ్రస్థాయిలో వాదించుకునేవారు. ఆ వాదన కాస్తా కాసేపటికి విషయం నుంచి డైవర్ట్ అయ్యి వ్యక్తిగత విషయాలని విమర్శించే దాకా వెళ్ళేది. ఇలా జరిగినప్పుడల్లా అందులో ఒక స్నేహితుడు ఆ విషయాన్ని ఇసుకపై వేలితో రాసేవాడు. రాసిన కాసేపటికి తిరిగి తన స్నేహితుడితో మునుపటిలా ప్రేమగా మాట్లాడేవాడు. ఇలా వారి ప్రయాణం సాగిపోతోంది.
స్నేహితుల్లో ఒక అతను ఇసుకపై వేలితో రాయటాన్ని గమనించిన మరో స్నేహితుడు ఏం రాస్తున్నావు? ఎందుకలా రాస్తున్నావు అని అడిగితే ఇతను నవ్వేసి ఏం లేదు అని చెప్పేవాడు. ఒకసారి స్నేహితుల్లో ఇలా రాసే వ్యక్తి ఓ ప్రమాదంలో పడతాడు. కొండ చివరి నుంచి లోయలోకి పడబోయే ఇతన్ని అతని స్నేహితుడు ఎంతో కష్టంగా రక్షిస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎన్నో దెబ్బలు కూడా తగులుతాయి. ఓ క్షణం అతను కూడా లోయలోకి పడబోతాడు. అంటే తన ప్రాణాలని కూడా లెక్కచేయకుండా తన స్నేహితుడిని రక్షిస్తాడు.
లోయలోకి పడబోతున్న అతని స్నేహితుడు ప్రాణాలు పణంగా పెట్టి రక్షించగానే, రక్షించబడ్డ వ్యక్తి వెంటనే చేసిన పని, తన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పి, వెంటనే పక్కనే వున్న రాతిపై చెక్కటం మొదలు పెట్టాడు. మరో వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఏంటా అని చూస్తే, తను చేసిన సహాయాన్ని ఆ రాయిపై రాయటం గమనించి ఆశ్చర్యపోయాడు. అంతా అయ్యాక విషయం ఏంటని అడుగుతాడు అతను తన స్నేహితుడిని. అప్పుడు ఆ స్నేహితుడు ఇలా చెబుతాడు. చిన్నప్పటి నుంచి మనిద్దరం ప్రాణ స్నేహితులం. కానీ ఎప్పుడు ఇలా కేవలం ఇద్దరమే ఇంత దూరం, ఇన్ని రకాల పరిస్థితులని, ప్రమాదాలని కలసి, దాటి ప్రయాణం చేయలేదు. మన ఈ ప్రయాణం గురించి తెలియగానే మా నాన్న నాకు ఓ మాట చెప్పారు. ఇంతవరకు మీరిద్దరు సరదాగా గడిపారు. కాబట్టి మీ మధ్య ఏ భేదాభిప్రాయాలు రాలేదు. ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. కానీ మీరు సాగించే ఈ ప్రయాణంలో మీరిద్దరే వుంటారు. పైగా ఎన్నో ప్రమాదాలు, ఒత్తిడులు. వీటి మధ్య ఎప్పుడైనా ఇద్దరి మధ్య తేడా వస్తే, నీ స్నేహితుడి వల్ల నీకు బాధ కలిగితే ఆ విషయాన్ని వెంటనే మర్చిపో. అదే నీ స్నేహితుడు నీకు ఏ చిన్నపాటి సాయం చేసినా దానిని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఈ విషయం నువ్వు మర్చిపోకుండా ఉండటానికి నీకు అతనిపై కోపం రాగానే ఆ విషయాన్ని ఇసుకలో రాయి. నీకు చేసిన సహాయాన్ని రాయిపై రాయి. ఇసుకలో రాసినది చెరిగిపోవటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఎదుటి వ్యక్తి నీకు చేసిన చెడుని మర్చిపో. రాతిపై రాత ఎంతకాలం నిలుస్తుందో అంత శాశ్వతంగా అతని మంచితనాన్ని గుర్తుపెట్టుకో. అదే "ఇసుకపై రాత, రాతిపై రాత " అని చెప్పాడు అతని తండ్రి.
మనం చాలాసార్లు పైన చెప్పుకున్న దానికి రివర్స్ లో ఎదుటివ్యక్తి మనకు చేసిన మంచిని ఇసుకపై, అలాగే చెడుని రాతిపై రాసి పెట్టుకుంటాం. అంటే ఎవరివల్లనైనా బాధ కలిగితే శాశ్వతంగా గుర్తు పెట్టుకుని, వారు చేసే మంచిని ఆ బాధ మధ్య మర్చిపోతాం. అందుకే చాలాసార్లు, చాలామందిపై ఆరోపణలు వుంటాయి. అదే వారు చేసే చిన్నచిన్న పొరపాట్లని వెంటనే మర్చిపోతూ, వారి వలన మనకి కలిగే మంచిని ఎప్పుడూ గుర్తుచేసుకోగలిగితే ఏ బంధంలోనైనా భేదాభిప్రాయాలు రావు. ఏ ఇద్దరు వ్యక్తులైనా కలసి ప్రయాణం చేయాలంటే ఈ సూత్రం తప్పక గుర్తుపెట్టుకోవాలి.
రమ ఇరగవరపు