మధ్యప్రదేశ్ లో రెండు ఘోర రైలు ప్రమాదాలు

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి 11.45 గంటలకు ఒకేచోట రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి.ముంబై నుండి వారణాశికి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్, జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు హర్దా జిల్లాలో ఖిర్కియా -బిరంగీ రైల్వే స్టేషన్ల మధ్య మాచక్ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయాయి.

 

మొదట కామయాని ఎక్స్ ప్రెస్ రైలు వంతెనపై పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 6 బోగీలు నదిలో పడిపోయాయి. మరికొన్ని నిమిషాలకి రెండవ వైపు నుండి వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా అదే వంతెనపైకి రాగానే పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా నాలుగు బోగీలు నదిలో పడిపోయాయి.

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానల కారణంగా మాచక్ నదికి వరద వచ్చి పట్టాల క్రింద రాళ్ళు, మట్టి కొట్టుకుపోవడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12మంది మరణించగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. కానీ రెండు రైళ్ళకి చెందిన బోగీలు నదిలో పడిపోవడం వలన ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉండవచ్చును. నదిలో రెండు రైళ్ళకు చెందిన మొత్తం 15బోగీలు పడిపోయినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే నిజమయితే మృతుల సంఖ్య చాలా భారీగా ఉండవచ్చును.

 

ఈ ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి చీకటిలో చాలా జోరుగా వాన కురుస్తున్న సమయంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నది మీద ఉన్న రైల్వే వంతెనపై సహాయ కార్యక్రమాలు చేప్పట్టడం చాలా కష్టం అయినప్పటికీ అధికారులు, సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ఇంతవరకు సుమారు 300 మందిని రక్షించగలిగారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరుతో సహా ఉన్నతాధికారులు, పోలీసులు అందరూ ప్రమాద స్థలానికి తరలివచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒకేసారి, ఒకేచోట రెండు రైళ్ళు పట్టాలు తప్పి నదిలో పడిపోవడం వెనుక మరేవయినా కారణాలున్నాయా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.