250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ.. అమరావతి ఒక అద్భుతం!

ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మూడేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శుక్రవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన ఆయన పనులకు ఈ నెలాఖరులోగా టెండల్లు పిలుస్తామనీ, ఫిబ్రవరి రెండో వారానికల్లా పనులు ప్రారంభమౌతాయనీ చెప్పరు.  అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తవుతాయని పునరు ద్ఘాటించిన మంత్రి నారాయణ.. న్యాయపరమైన అంశాల కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు.

మీడియాతో మాట్లాడడానికి ముందు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడు సమీపంలో  అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఇప్పటికే 40 పనులకు టెండర్లు పిలవడం జరిగిందని వెల్లడించారు.  జగన్ ప్రభుత్వం  అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక అమరావతి పనులు చకచకా జరుగుతాయనీ, అందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనీ చెప్పిన ఆయన అమరావతి ప్రపంచంలోని 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.   2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం 4053 అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిందన్న నారాయణ.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటి పనులనూ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని విమర్శించారు.

250 మీటర్ల ఎత్తులో అసెంబ్లీ నిర్మాణం చేపడతామనీ, అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో  ఆ ప్రదేశాన్ని పర్యటక ప్రాంతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.  రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే ప్రాంతంలో నివాసం ఉండేలా ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు.