‘మా’ ఎన్నికల తీర్పు నేడే

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈరోజు హైదరాబాద్ నగర సివిల్ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ‘మా’ ఎన్నికల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా వుందంటూ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన నటుడు ఓ.కళ్యాణ్ కోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం పోలింగ్‌కి అనుమతించిన కోర్టు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి, న్యాయ సలహాదారుడిని నియమించలేదని కళ్యాణ్ వాదించారు. కళ్యాణ్ ఆరోపణల్లో నిజం లేదని ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి అలీ, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కోర్టుకు తెలిపారు. కళ్యాణ్‌కి అభ్యంతరం వుంటే ముందే ఎందుకు చెప్పలేదని, ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసి, ప్రచారం చేసి, అంతా ముగిశాక కోర్టుకు రావడం ఏమిటని వారు వాదించారు. ఎన్నికల ప్రక్రియ అంతా నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని, ఓట్ల లెక్కింపుకు కోర్టు అనుమతించాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వనుంది.