తాళి తెంచు శుభవేళ...

 

తమిళనాడుకు చెందిన ద్రావిడార్ కజగం అనే సంస్థ మహిళలు తమ తాళిబొట్లను తెంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల మెడలలో వుండే తాళిబొట్లు బానిసత్వానికి చిహ్నాలని, వాటిని తెంచుకోవాలని ద్రావిడార్ కజగం గత కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. హిందూ వ్యతిరేకి అయిన దివంగత పెరియార్ స్ఫూర్తితో ఈ సంస్థ ఆవిర్భవించింది. ఈ తాళిబొట్లు తెంచే కార్యక్రమానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకుని నిర్వహించింది. తొలివిడత కార్యక్రమంలో 25 మంది మహిళలు తమ మెడల్లో వున్న తాళిబొట్లను తెంచుకున్నారు. వాటిని ద్రావిడార్ కజగం సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఇంతకాలం తమను బానిసలుగా చేసిన తాళిబొట్లను తెంచుకోవడం తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని సదరు మహిళలు మురిసిపోతూ చెప్పారు. ఇదిలా వుంటే, తాళిబొట్లు తెంచుకునే కార్యక్రమం హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా వుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో దీన్ని నిలిపివేస్తే న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే న్యాయస్థానంలో పోరాటం చేసి తాళిబొట్లు తెంచుకునే కార్యక్రమానికి అనుమతులు తెచ్చుకుని కొనసాగిస్తామని ద్రావిడార్ కజగం సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.