బీజేపీ బిగ్ స్కెచ్‌.. దక్షిణాదిలో పాగాయే లక్ష్యం!

భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.  పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. అదే క్ర‌మంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించ‌డం బీజేపీ బిగ్ ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో బీజేపీ హ‌వా సాగుతున్నా.. ద‌క్షిణాది రాష్ట్రాల‌లో మాత్రం బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంది.   ప్రాంతీయ పార్టీల‌తోపాటు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాస్త బ‌లంగానే ఉంది.  బీజేపీ మాత్రం ద‌క్షిణాది రాష్ట్రాలలో  కాలూనడానికే నానా ఆపసోపాలు పడుతోంది. ఇటీవ‌లి సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక పోయింది. ఆ రాష్ట్రాల్లో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్, డిఎంకె, ఎఐఎడిఎంకె, తెలుగుదేశం, వైసీపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్నాయి. అయితే, 2027లో జ‌మిలి ఎన్నిక‌ల ఊహాగానాల నేప‌థ్యంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ట‌.

ద‌క్షిణాది రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని సాధించ‌గా.. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. క‌ర్ణాట‌క‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ‌లో ఇప్ప‌డిప్పుడే బ‌ల‌మైన పార్టీగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణలో ఎనిమిది పార్ల‌మెంట్ స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంది. అయితే, ఎన్నిక‌ల త‌రువాత అదే ఊపును  కొన‌సాగించ‌డంలో  మాత్రం విఫలమైంది.  ఇక ఆంధ్ర్రప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే ప్రాంతీయ పార్టీలతో క‌లిసి అధికారంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. వాస్త‌వానికి ఏపీలో బీజేపీకి పెద్ద‌గా బ‌లం లేదు.

తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల అండ‌తో ఆ పార్టీ అభ్య‌ర్థులు కొంద‌రు గ‌త ఎన్నిక‌ల్లో  విజ‌యం సాధించారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. ఈ క్ర‌మంలో రాబోయే కాలంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై బల‌మైన ముద్ర వేసేందుకు బీజేపీ అధిష్టానం, ఆర్ఎస్ఎస్ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ ప‌గ్గాల‌ను ద‌క్షిణాది నేత‌కు అప్ప‌గించే ఆలోచ‌న‌లో పార్టీ పెద్ద‌లు ఉన్నారని బీజేపీ నేతలే అంటున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ అధ్యక్ష పదవికి పార్టీ అధిష్ఠానం వారణాసి రామ్ మాధవ్, వెల్లంవెల్లి మురళీధరన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అనుభవజ్ఞులైన వ్యూహకర్తలుగా వారిద్ద‌రికి పేరుంది.  బీజేపీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స‌మ‌ర్ధ‌త క‌లిగిన వారిగా పార్టీ అధిష్టానం సైతం వారిని గుర్తించింది.  వారిలో ఒక‌రికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ రాబోయే కాలంలో బీజేపీని బ‌లోపేతం చేయొచ్చున‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద‌ల వ్యూహంగా రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  

దేశ రాజ‌కీయాలు ప్ర‌స్తుతం జ‌మిలి ఎన్నిక‌ల చుట్టూ తిరుగుతున్నాయి. జాతీయ‌, రాష్ట్ర స్థాయిలో ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని కేంద్రం భావిస్తోంది. దీనికి తోడు ఇందుకు అవ‌స‌ర‌మైన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. కేంద్రం దూకుడు చూస్తుంటే 2027లో జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జ‌రిగితే బీజేపీకి ఉత్త‌రాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలోనూ అత్య‌ధిక పార్ల‌మెంట్ స్థానాల‌తో పాటు.. రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం స‌వాలుగానే ఉంటుంది. ఈ ప‌రిస్థితుల్లో ద‌క్షిణాది రాష్ట్రాల నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌ొచ్చ‌ని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రామ్ మాధ‌వ్‌, వెల్లంప‌ల్లి ముర‌ళీర్ వంటి అనుభ‌వజ్ఞులైన వారిలో ఒక‌రికి జాతీయ స్థాయిలో పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు బీజేపీ పెద్ద‌లు ఆలోచ‌న చేస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది.    ద‌క్షిణాది నేత‌కు జాతీయ స్థాయిలో పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. బీజేపీ కేవ‌లం ఉత్త‌ర భార‌త‌దేశం పార్టీ అనే అప‌వాదును తుడిపేసిన‌ట్ల‌వుతుంది. ద‌క్షిణాది ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను బీజేపీ గౌర‌విస్తుంద‌న్న నమ్మకాన్ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల్లో   క‌లిగించిన‌ట్లు అవుతుంది. దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని న‌రేంద్ర మోడీ త‌రుచుగా ప‌ర్య‌టిస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి మోదీ పెద్ద‌పీట వేస్తున్నార‌న్న భావ‌న ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో క‌లుగుతోంది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాది నేత‌కు బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తే పార్టీ బ‌లోపేతానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

రామ్ మాధ‌వ్‌, ముర‌ళీధ‌ర‌న్ పేర్ల‌ను మాత్ర‌మే బీజేపీ పెద్ద‌లు ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌నే చ‌ర్చ‌కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో రామ్ మాధవ్ ప్రయాణం ఆయన టీనేజ్ నుంచే ఆరంభమైంది. 1981లో ఆర్ఎస్ఎస్‌లో పూర్తిస్థాయి కార్య‌క‌ర్త‌గా మారడానికి రామ్ మాధవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాల్లో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మాధవ్ 2003 నుండి 2014 వరకు ఆర్ఎస్ఎస్‌ సంస్థ జాతీయ ప్రతినిధిగా కొన‌సాగారు.  2014లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ ప‌నిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో రామ్ మాధ‌వ్ నిర్ణ‌యాలు కీల‌క భూమిక పోషించాయి. అంతేకాక‌.. ఈశాన్య భారతదేశంలో పార్టీ అభివృద్ధికి  ప్రాంతీయ పార్టీలతో పొత్తులను బ‌లోపేతం చేయ‌డంలో కీలకంగా వ్యవహరించారు. మ‌రోవైపు  మురళీధరన్ కు జాతీయ స్థాయిలో పార్టీలో మంచిప‌ట్టు ఉంది. మురళీధరన్ 1998లో లోక్‌సభ ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడుకు సహాయం చేస్తూ బీజేపీలోకి ప్రవేశించారు. 1999లో నెహ్రూ యువకేంద్ర వైస్‌ చైర్మన్‌గా నియమితులైన ఆయన, ఆ తర్వాత బీజేపీ ఎన్‌జీవో, శిక్షణా విభాగాల జాతీయ కన్వీనర్‌గా కీలక పాత్రలు నిర్వహించారు. బీజేపీ కేరళ ఉపాధ్యక్షుడిగా (2006-2010) పనిచేసిన ఆయన..  సైద్ధాంతిక శిక్షణపై దృష్టి సారించారు. 2010, 2013లో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పార్టీ సభ్యత్వం, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచారు. 2018లో రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. మాధ‌వ్‌, ముర‌ళీధ‌రన్ ఇద్ద‌రూ పార్టీ జాతీయ‌ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు స‌మ‌ర్ధ‌త క‌లిగిన వారు. అయితే, బీజేపీ పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు, జ‌మిలి ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ద‌క్షిణాదిలో బీజేపీ ప్ర‌భావాన్ని పెంచేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్నార‌నే అంశాలు ఆసక్తికరంగా మారాయి.