తెదేపాలోకి కొణతాల రామకృష్ణ?

 

సార్వత్రిక ఎన్నికల తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ నేటి వరకూ కూడా ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లేదా తెదేపాలలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. మళ్ళీ కొన్ని రోజుల క్రితం ఆయన తిరిగి వైకాపాలోకి చేరవచ్చునని, ఆయనకి విశాఖ నుండి యం.యల్సీ. సీటు కేటాయించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు.

 

ఆ సీటును త్వరలో వైకాపాలో చేరబోతున్న బొత్స సత్యనారాయణకి కేటాయించాలని వైకాపా భావిస్తునందున ఇక కొణతాల రామకృష్ణ వైకాపాలోకి తిరిగి వెళ్ళకపోవచ్చును. పైగా బొత్స సత్యనారాయణని విశాఖ జిల్లా పార్టీ-ఇన్-చార్జ్ గా నియమించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భావిస్తునందున ఒకవేళ కొణతాల మళ్ళీ చేరినా ఆయనకు ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఉండబోదు.

 

దాడి వీరభద్రరావు నిష్క్రమణతో ఆయన స్థానంలో మరొక బలమయిన నాయకుడుని నియమించుకోవలసిన అవసరం తేదేపాకు ఏర్పడింది. కనుక అంతటి సమర్దుడయిన కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి విశాఖలో ఉన్న రెండు యంయల్సీ. స్థానాలలో ఒకటి ఆయనకు కేటాయించాలని తెదేపా అధిష్టానం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆయన ఇప్పటికిప్పుడు తెదేపాలో చేరకపోయినా, ఆయన విశాఖ నుండి యంయల్సీగా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వాలని తెదేపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. యంయల్సీ. ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి జూన్ 16వ తేదీ వరకు గడువు ఉంది కనుక ఈలోగానే ఆయన తెదేపాలో చేరబోతున్నారా లేదా అనే విషయం తేలిపోవచ్చును.