ఏపీ లా కాకుండా చూడండి.. కోదండరామ్
posted on Sep 26, 2015 1:00PM
మొత్తానికి కోదండరాం తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని ఓ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్.. జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్నిరోజుల క్రితం వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ గురించి ప్రస్తావించారు. ఎన్‌కౌంటర్ అనేది తప్పు అని, అలాంటి సంఘటనలు జరగకూడదని అంటూ తీసుకొచ్చి కాల్చేసినట్లే కనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను ప్రతిపక్ష నేతగా ఉంటారా లేదా? అధికార పక్షనేతగా ఉంటారా అన్న దానిపై వార్తలు వచ్చిన నేపథ్యంలో దానిపై స్పందిస్తూ.. తాను రాజకీయాల్లోకి వెళ్తానని వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే అని.. తనకు అధికార దాహం లేదని, తాను ఎల్లవేళలా ప్రజల పక్షమేనని అన్నారు. అంతేకాదు మరోవైపు ప్రతిపక్షాలపై తమకు ఏ విధమైన కోపం లేదని, అయితే వారితో కలిసి పనిచేయలేమని వారి కార్యాచరణలు వేరు.. మావి వేరని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో చర్చలు కంటే గొడవలు.. అరుచుకోవడాలే ఎక్కువయ్యాయి.. ఆ పంథాలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అరుచుకోవడం మాని ప్రజాసమస్యలపై చర్చించి ముఖ్యంగా రైతు ఆత్మహత్యల గురించి ఆలోచించాలని..రైతుల కుటుంబాలకు జూన్ 2వ తేదీ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు.