పవన్ శ్రీజని పలకరిస్తాడా?
posted on Dec 1, 2014 9:45AM
ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక శ్రీజ తీవ్ర అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ పవన్ కళ్యాణ్‌ని చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం, పవన్ కళ్యాణ్ ఖమ్మం వెళ్ళి శ్రీజను చూడటం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెళ్ళిన సమయంలో శ్రీజ స్పృహలో లేకపోవడంతో ఆయన్ని చూడలేకపోయింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కంటతడి కూడా పెట్టుకున్నారు. ఆ సంఘటనను టీవీల్లో చూసిన వారి హృదయాలు కూడా ద్రవించాయి. ఇప్పుడు ఆ పాప శ్రీజ కోలుకుంది. ఆదివారం నాడు ఆస్పత్రిలోనే ఆమె తన 13వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా మీడియాతో శ్రీజ మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను’ అంటూ మాట్లాడింది. ప్రస్తుతం శ్రీజ వేగంగా కోలుకుంటోంది. ఎవరి సహాయం అవసరం లేకుండానే నడవగలుగుతోంది. కొద్దికొద్దిగా ఘనాహారం తినగలుగుతోంది. శ్రీజ కోలుకోవడంతో ఖమ్మానికి చెందిన డాక్టర్ అసాధారణ్, సిబ్బంది కృషి ఎంతో వుందని శ్రీజ తల్లిదండ్రులు చెప్పారు. చిన్నారి శ్రీజను పరామర్శించిన పవన్ కల్యాణ్‌కు, ఆర్థిక సహాయం చేసిన హీరో అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్‌లోని తన తోటి ఉద్యోగులకు, హీరో పవన్ కళ్యాణ్ రాక కోసం కృషిచేసిన ‘మేక్ ఎ విష్’ సంస్థకు, మీడియాకు.. వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి శ్రీజ కోలుకున్న తర్వాత తాను మరోసారి వస్తానని పవర్ స్టార్ చెప్పారు. ఇప్పుడు శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు మరోసారి పవన్ కళ్యాణ్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.