పోస్టాఫీసులలోనూ శ్రీవారి దర్శనం టిక్కెట్లు

 

ఇకనుంచి పోస్టాఫీసులలో కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం టిక్కెట్లు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు లభిస్తాయి. శ్రీవారి దర్శనానికి 3 వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల బుకింగ్‌ని సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లోని తొమ్మిది తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె పోస్టాఫీసు, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఈ స్పెషల్ దర్శనం టిక్కెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లను ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారు. త్వరపడండి.. ఆలసించిన ఆశాభంగం...