ఇంటర్ పరీక్షల పరిస్థితేంటి?

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పెద్ద గందరగోళంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ని కోరారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఈ నేపథ్యంలో గవర్నర్ ఒక నిర్ణయం తీసుకుని ఈ గందరగోళానికి తెర దించాలని గంటా ఆదివారం నాడు గవర్నర్ని కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఒక వినతి పత్రం గవర్నర్‌కి ఇచ్చారు. రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించాలంటూ గతంలో గవర్నర్‌ చేసిన ప్రతిపాదనను తాము అంగీకరిస్తున్నామని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ప్రతిపాదించిన మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఛైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి కో ఛైర్మైన్‌గా ఉండటానికి, ఇంటర్మీడియట్ ఉమ్మడి పరీక్షల నిర్వహణకు స్టీరింగ్‌ కమిటీ వేయడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తోందని మంత్రి గంటా ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.