పచ్చగడ్డి మీద నడిస్తే... ఆరోగ్యం వస్తుందా!
posted on May 30, 2016 11:17AM
మనిషి ఈ ప్రకృతిలో ఒక చిన్న భాగమే! కానీ ఈ ప్రకృతికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదన్నంతగా అతని జీవనశైలి మారిపోయింది. ఒక పక్క ప్రకృతిని తనకు అనుకూలంగా ఎడాపెడా వాడేసుకుంటూనే, నాలుగ్గోడల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఫలితం... కృత్రిమమైన జీవితంలాగానే, కృత్రిమమైన జబ్బులూ వచ్చేస్తున్నాయి.
మరే ఇతర జీవికీ లేనంతగా, మనిషి చిన్న వయసు నుంచే నానారకాల వ్యాధుల పాలిట పడుతున్నాడు. అందుకే ప్రకృతికి తిరిగి చేరువయ్యే మనిషికి ఆరోగ్యం కూడా దక్కుతుందంటూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ఒకటే పచ్చగడ్డి మీద నడక! రోజురోజుకీ ప్రచారంలోకి వస్తున్న ఈ విధానం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే...
- రిఫ్లెక్సాలజీ అనే శాస్త్రం ప్రకారం మన శరీరంలోని నాడులన్నీ కూడా పాదాల దగ్గరకి వచ్చి ఉంటాయి. కాబట్టి మన పాదంలోని ఒకొక్క భాగం మీద ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న నాడికి చెందిన అవయవం మీద అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. పచ్చగడ్డిలో నడిచేటప్పుడు మన పాదంలోని ప్రతి అణువు మీదా ఒత్తిడి కలిగి తీరుతుంది కాబట్టి... రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇది మన శరీరం మొత్తాన్నీ స్వస్థత పరుస్తుంది.
- పచ్చటి నేల మీద నడిచేటప్పుడు భూమితో ఒక అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నంత తృప్తిగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి వల్ల మనసు చాలా ప్రశాంతని పొందుతుందంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంతో ఏర్పడే ఒత్తిడి, భయాందోళనలన్నీ... ఇలా ప్రకృతిలో మమేకం అవ్వడం వల్ల దూరమవుతాయంటున్నారు.
- నిరంతరం పాదాలకు తోలుతోనో, ప్లాస్టిక్‌తోనో చేసిన చెప్పులను ధరించడం వల్ల... మన శరీరం మీద భూమిలోని అయస్కాంత క్షేత్రం చూపించే ప్రభావంలో అనుకూల/ ప్రతికూల మార్పులు రావచ్చు. రోజులో కాసేపన్నా ఇలా గడ్డి మీద నడవడం వల్ల మన శరీరం మీద ఈ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.
- పచ్చగడ్డి మీద నడవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని తేలింది. ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- రిఫ్లెక్సాలజీ ప్రకారం పచ్చగడ్డి మీద నడిచేటప్పుడు, మన పాదంలో... కంటినాడి మీద ప్రభావం చూపే స్థానాల మీద ఒత్తిడి కలుగుతుంది. రెండు- నిరంతరం కంప్యూటర్ ముందో, పుస్తకం ముందో, పేపరు పట్టుకునో కూర్చునే మనకి అప్పుడప్పుడూ కాస్త దూరంగా, పచ్చగా ఉండే వస్తువులు కనిపిస్తూ ఉండాలని వైద్య శాస్త్రం చెబుతోంది.
- నిరంతరం బూట్లు లేదా చెప్పులు ధరించి ఉండేవారికి... అరికాళ్లలో రక్తప్రసారం తగ్గిపోయి, పాదాలు మొద్దుబారిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజులో కాసేపన్నా పచ్చగడ్డి మీద నడిస్తే అప్పుడు తెలుస్తుంది... ఆ స్పర్శలో ఉన్న హాయి ఏమిటో. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డిలో నడక మన పాదాలకు మంచి మసాజ్‌లాంటిది.
- ఉదయాన్నే కాసేపు అలా పచ్చగడ్డి మీద నడిస్తే ఆ తాజా గాలి, పచ్చగడ్డి మీద నుంచి వచ్చే పసిరిక వాసనా, మెత్తటి గడ్డి అందించే స్పర్శా... ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని అందిస్తాయి. ఇక ఆ సమయంలో పై నుంచి వచ్చే సూర్యరశ్మి కూడా మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్ ‘డి’ను అందిస్తుంది. నేటి జీవనశైలితో వస్తున్న కీళ్ల వ్యాధి నుంచి డయాబెటిస్‌లకు ‘డి’ విటమిన్ లోపం కూడా ఓ కారణం అని ఇప్పటికే తేలింది. నిరంతరం నాలుగ్గోడల మధ్యే ఉంటున్న జనానికి సహజమైన ఈ విటమిన్ అందడం లేదని వెల్లడైంది. దీనికి ఉదయపు నడకే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతున్నారు.
చెప్పుకుంటూ పోతే... పచ్చగడ్డి మీద నడిస్తే వేస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఓ నాలుగడుగులు అలా వేసి చూడండి. ప్రత్యేకించి కాకపోయినా... ఎప్పుడన్నా పచ్చగడ్డి కనిపిస్తే దాని మీద పాదం మోపి చూడండి. మీరే ఒప్పుకుంటారు... ఆ స్పర్శలో ఏదో మాయ ఉందని!
- నిర్జర.