వంగవీటి పయనం ఎటు!
posted on Jul 4, 2015 11:58AM
కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇప్పుడు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేని కారణంగా తాను కూడా కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కేంటంటే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలోకి చేరడం వల్ల ఆపార్టీలో ఉన్న వంగవీటి రాధా కుటుంబం పరిస్థితి ఎంటని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. ఎందుకంటే దేవినేని నెహ్రూ, వంగవీటి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. అయితే ఇప్పుడు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం ఎటువైపు పయనిస్తుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రెండు కత్తులు ఒక ఒరలో ఉండవన్నట్టు దేవినేని నెహ్రూ వైకాపాలో చేరితే వంగవీటి కుటుంబం మాత్రం వైకాపాను వీడటం కచ్చితమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో కూడా బొత్స సత్యనారాయణ వైకాపాలోని చేరడం ఎంతమాత్రం ఇష్టంలేని సుజయ్ సోదరులు కూడా అప్పట్లో పార్టీని వీడతారు అనే వార్తలు బాగా ప్రచారం చేశాయి. కానీ అలాంటిది జరగలేదు.. సుజయ్ కృష్ణా రంగారావు కూడా పార్టీనీ వీడే ప్రసక్తే లేదని.. వైకాపాలోనే ఉంటామని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పుటి పరిస్థితి వేరు.
ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి.. వంగవీటి రాధా కుంటుబానికి మధ్య ఉన్న శత్రుత్వం అలాంటిది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి తాతను చంపిన కుటుంబంతో కలిసి జగన్ కూర్చోగలడా.. అలాగే నేను కూడా వీళ్లతో కలిసి ఎలా కూర్చోగలను అని అన్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ విజయవాడ పర్యటనకి కూడా రాధా డుమ్మాకొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు జగన్, విజయ్ సాయిరెడ్డి, వై సుబ్బారెడ్డిలు కలిసి వంగవీటి కుటుంబానికి నచ్చేజెప్పడానికి ప్రయత్నించగా రాధా మాత్రం వారికి టచ్ లోకి రాలేదు. దీంతో జగన్ కొడాలి నానికి రంగంలోకి దించి ఆయన చేత నచ్చజెప్పే ప్రయత్నం చేయించినా ఆ ప్రయత్నంలో నాని కూడా విఫలమయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం రాధా చాలా పట్టుదలగా ఉన్నారని.. ఒకవేళ దేవినేని నెహ్రూ కనుక వైకాపా లోకి వస్తే వంగవీటి రాధా బీజేపీలోకి కాని.. టీడీపీ లోకి చేరే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. చూడాలి ఇంతకీ వంగవీటి పయనం ఎటు సాగుతుందో..