బీజేపీకి మరో గట్టి దెబ్బ.. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం!!

 

మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కొద్ది రోజుల్లో కర్ణాటకలో కూడా బీజేపీకి ఇలాంటి షాకే తగిలే అవకాశముందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలిచినా అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్ లు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కేవలం 9మంది ఎమ్మెల్యేలు తక్కువై అధికారం చేపట్టలేకపోయిన బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు ఈ ఏడాది జూలైలో విజయం సాధించింది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ లేకుండా చేసింది. యడియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తోంది.

ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేరికతో ప్రస్తుతం బీజేపీ బలం 105 గా ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బీజేపీకి మెజారిటీ సరిపోయింది. కానీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో ఉంటే బీజేపీకి మెజారిటీ లేనట్టే. అందుకే ఇప్పుడు బీజేపీకి ఉపఎన్నికలు కీలకం కానున్నాయి. డిసెంబర్ 5 న కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 9 న తేలనున్నాయి. ఉపఎన్నికల్లో కనీసం 7 స్థానాలు గెలిస్తేనే బీజేపీ సర్కార్ సేఫ్‌జోన్‌ లో ఉంటుంది. లేదా మూడు నెలల ముచ్చటగానే మిగిపోయే అవకాశముంది. ఉపఎన్నికల్లో సత్తాచాటి బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్-జేడీఎస్ దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే.. డి.కె.శివకుమార్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దేవేగౌడ కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఉపఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచి అధికారం నిలుపుకుంటుందో లేక మహారాష్ట్రలో లాగా దెబ్బ తింటుందో చెప్పాలి.