మైత్రి తెచ్చిన కష్టాలు.. శివసేనపై విరుచుకుపడుతున్న అమిత్ షా & కో

 

మహారాష్ట్ర లో మూడు దశాబ్దాల మైత్రి బంధాన్ని తెంచుకొని ఎన్సీపీ-కాంగ్రెస్ తో జట్టు కట్టిన శివసేనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన నేతలు అవమానించారంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజాగా బీజేపీ స్పందించింది. సీఎం పదవిపై వ్యామోహంతోనే బీజేపీ కూటమి నుంచి శివసేన తనంతట తానే విడిపోయిందని కమలదళం మండిపడుతుంది. సీఎం పదవి ఇస్తామని ఎన్నికల ముందు శివసేనకు హామీ ఇవ్వలేదని.. బీజేపీ మరోసారి స్పష్టం చేసింది. 

శివసేన మహారాష్ట్ర ప్రజా తీర్పును అవమానించిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టి, ఎన్నికల ముందు పెట్టుకున్న పొత్తును వీడిన శివసేన బిజెపిని నిందిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సైద్ధాంతికతకు, అన్ని విలువలకు తిలోదకాలిచ్చి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని విమర్శించారు. సీఎం పదవిపై శివసేనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే, ఆదిత్య ఠాక్రే పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని తాము ప్రతిచోటా చెప్పామని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడెందుకు వారు అభ్యంతరం వ్యక్తం చేయలేదని నిలదీశారు. శివసేన ఎమ్మెల్యేలందరూ తమతో కలిసి గెలిచిన వారేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకోని వారు శివసేనలో ఏ ఒక్కరూ లేరని తెలిపారు. ప్రచార సభల్లో మోదీవే పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టారని ఇవన్నీ దేశ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు అమిత్ షా. 

మహారాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇవ్వటంలో ఆంతర్యమేంటని అమిత షా ప్రశ్నించారు. వంద సీట్లు గెలిచిన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికే ముఖ్యమంత్రి పదవి దక్కాలి తప్ప శివసేనకు ఇవ్వడమేంటని శరద్ పవార్, సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీన్ని బేరసారాలు కాక ఇంకేమంటారని నిలదీశారు బీజేపీ చీఫ్. ఇక దీని పై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, అమిత్ షా ఏమైనా మాట్లాడగలరని అన్నారు. మోడీ కటౌట్ లు పెట్టుకొని శివసేన ఎమ్మెల్యేలు గెలిస్తే బాల్ థాక్రే పోస్టర్ పెట్టుకుని బిజెపి ఎమ్మెల్యేలు గెలిచారు అన్నారు. మొత్తానికి మైత్రి బంధానికి తిలోదకాలిచ్చిన శివసేనపై బిజెపి ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తోంది. మహారాష్ట్ర కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అది ఎన్నాళ్లపాటు అధికారంలో ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.