టీడీపీ బాటలో దగ్గుబాటి దంపతులు?
posted on Sep 15, 2014 11:25PM
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న దగ్గుబాటి దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు రావడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది చరిత్ర చెబుతున్న సత్యం కాబట్టి ఈ పరిణామం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి దంపతులు టీడీపీలోకి వెళ్ళేందుకు తాము కూడా సానుకూలంగానే ఉన్నామని, అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని చెప్పారని ప్రచారం జరుగుతోంది.