కాంగ్రెస్ పార్టీకి అభయహస్తం ఇవ్వగల నాయకుడే లేడా?
posted on Jul 3, 2015 12:51PM
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి చందంగా మారింది. ఆంధ్రాలో పార్టీని, తన నేతల రాజకీయ భవిష్యత్ ని, చివరికి కోట్లాది ఆంద్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను అన్నిటినీ పణంగా పెట్టి ఆడిన ఎన్నికల జూదంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఆంద్రప్రదేశ్ లో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఆ పార్టీ అధిష్టానానికి చాలా ఖచ్చితంగా ముందే తెలుసు కనుక అంతగా బాధపడి ఉండకపోవచ్చును. కానీ తెలంగాణా ఇచ్చినా గెలవడం మాట అటుంచి కనీసం అక్కడయినా పార్టీ బ్రతికి బట్టకడితే చాలానే స్థితికి చేరుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణా నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదు.
బంగారు పళ్ళేనికయినా గోడ చేర్పు ఉంటేనే అందం అన్నట్లుగా ఏ రాజకీయ నాయకుడికయినా ఏదో ఒక పార్టీ అండ ఉన్నంత కాలమే అతనికి సమాజంలో విలువ, గుర్తింపు ఉంటుంది. ఆ విషయం మరిచిపోయిన కాంగ్రెస్ నేతలు తమ శక్తిని అతిగా ఊహించేసుకొని తమ వల్లనే పార్టీ బ్రతుకుతోందనే భ్రమలో పార్టీని నిర్లక్ష్యం చేయడం వలననే ఇటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పవచ్చును. నిజమే...కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం వంటిది అందులోకి అనేక మంది వచ్చి పోతూనే ఉంటారు. నిజమే...కాంగ్రెస్ పార్టీ పచ్చగడ్డి వంటిదే. నీళ్ళు లేనప్పుడు అది పూర్తిగా నశించిపోయినట్లు పైకి కనబడినా ఏమాత్రం తడి తగిలినా మళ్ళీ మొలకెత్తే గొప్ప లక్షణం ఉన్న పచ్చగడ్డిలాంటిదే కాంగ్రెస్ పార్టీ కూడా. అందుకే అది ఎన్ని ఆటుపోటులెదురయినా తట్టుకొని మళ్ళీ లేచి నిలబడుతుంటుంది. కానీ అందుకోసం రాష్ట్ర నేతలో లేదా కాంగ్రెస్ అధిష్టానమో చాలా బలమయిన ప్రయత్నాలు చేసినందునే ఆ పార్టీ పచ్చగడ్డిలా చిగురిస్తుండేది.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకొన్నప్పుడు ఇందిరా గాంధీ, పీవీ నరసింహ రావు వచ్చి దానిని నిలబెట్టారు. రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురయినప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి దానిని నిలబెట్టారు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ కేంద్రంలో గానీ కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ప్రసాదించగల గొప్ప నాయకులు ఎవరూ కనబడటం లేదు. ఆంద్ర, తెలంగాణాలలో అటు పార్టీ నేతలకి, ఇటు ప్రజలందరికీ ఆమోదయోగ్యుడయిన నాయకుడు ఒక్కడు కనబడటం లేదు.
ఇక కేంద్రంలో పరిస్థితి సరేసరి! ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నడిపిస్తున్నారా? లేకపోతే రాహుల్ గాంధీ నడిపిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. రెండు నెలలు విదేశాలలో తపసు చేసి జ్ఞానోదయం పొందారని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్న సంగతి ఇంకా గ్రహించారో లేదో తెలియదు కానీ తాను ప్రధాని మోడీకి ఏమాత్రం తీసిపోనని రుజువు చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. యధారాజా తధా ప్రజా అన్నట్లుగా ఒక దశదిశా లేకుండా కాంగ్రెస్ అధిష్టానం సాగుతుంటే, రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలు కూడా అలాగే సాగుతున్నాయి.
ముందే చెప్పుకొన్నట్లుగా గల్లీ నుండి డిల్లీ వరకు ఉండే ఏ రాజకీయ నాయకుడికయినా పార్టీ యొక్క అండాదండా ఉంటేనే సమాజంలో ఒక విలువ, గుర్తింపు ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కలిసి ముందుగా తమ పార్టీని బ్రతికించుకొనే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదే అన్నట్లు తయారయింది. ఎవరూ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. (దానినే వారు ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పుకొంటుంటారు!) మునిగిపోతున్న కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో నుండి నేతలు ఒకరొకరుగా బయటకి దూకేస్తున్నా కూడా కెప్టెన్ రాహుల్ గాంధీ ఇంకా మేలుకోకపోవడం విచిత్రమే. కనుక మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోయినట్లే కనబడుతోంది. కనుక ముందే చెప్పుకొన్నట్లు మళ్ళీ ఎవరో ఒక గొప్ప నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి పార్టీలో పుట్టుకొచ్చేవరకు, నీటి చుక్క కోసం ఎదురుచూసే ఎండుగడ్డిలా కాంగ్రెస్ పార్టీ ఎదురుచూడక తప్పదు.