ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి

 

రాష్ట్ర విభజన చేసినట్లయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేస్తామని సోనియా గాంధీకి హామీ ఇచ్చిన టీ-కాంగ్రెస్ నేతల్లో డి.శ్రీనివాస్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా పేర్కొనబడే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి అనేకమంది రాష్ట్ర విభజన చేస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగాతుడిచిపెట్టుకుపోతుందని ఆమెను హెచ్చరించినా ఆమె వారి మాటలను పెడచెవిన పెట్టి, శ్రీనివాస్ వంటి నేతలను గుడ్డిగా నమ్మి హడావుడిగా రాష్ట్ర విభజన చేసేసి ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లు విచారిస్తున్నారు. వారందరూ ఆంధ్రాకి చెందిన నేతలు కనుకనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని సోనియా గాంధీ భావించారు తప్ప పార్టీ హితవు కోరి చెపుతున్నారని అనుకోలేదు. చివరికి వారు చెప్పినట్లే రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోతోంది.

 

తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ అదే పని గత పదేళ్లలో ఒక పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా చేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం కానీ నష్టం గానీ జరిగి ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడానికి గల అనేక కారణాల గురించి అందరికీ తెలుసు. కనుక మళ్ళీ వాటినిప్పుడు నెమరు వేసుకోనవసరం లేదు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు హోదా అనుభవించిన డి. శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు ఇప్పుడు తమ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దానికి అండగా నిలిచి పార్టీ ఋణం తీర్చుకోవలసింది పోయి తమకు ఈ హోదా, ప్రజలలో ఈ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే నిందిస్తూ కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు దూకేస్తున్నారు. నిత్యం ప్రజలకు, ప్రత్యర్ధ రాజకీయ పార్టీలకు నీతులు, ధర్మపన్నాలు వల్లించే రాజకీయ నాయకులు అధికారం కోసం ఇంతగా తహతహలాడిపోవడం చూసి ప్రజలు కూడా విస్మయం చెందుతున్నారు.

 

సాధారణంగా ఎన్నికలకు ముందు,ఆ తరువాత మాత్రమే ఇటువంటి రాజకీయ వలసలు చూస్తుంటాము. కానీ తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన తరువాత కూడా ఇతర పార్టీల నేతలని తెరాసలోకి ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చూస్తుంటే, తెలంగాణాలో అసలు ప్రతిపక్షమన్నదే ఉండకూడదని తెరాస కోరుకొంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమని నమ్మవలసివస్తోంది. తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ని ప్రలోభపెట్టడం చాలా హేయమయిన చర్య, ప్రజాస్వామ్యాన్ని, దాని విలువలని ఖూనీ చేయడమేనని, అటువంటి వ్యక్తి క్షమార్హుడు కాదని వాదిస్తూ ధర్మపన్నాలు వల్లిస్తున్న అధికార పార్టీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అని ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు రాజకీయ పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి.

 

ఇప్పుడు తెరాస చర్యలను తెలంగాణా వాదులు చాలా గట్టిగా సమర్ధించుకోవచ్చును. కానీ ఏదో ఒకనాడు రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేకుండా పోయిననాడు ప్రజాస్వామ్యం స్థానంలో నిరంకుశ పాలన మొదలయితే అప్పుడు తాపీగా వగచక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.