జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మళ్ళీ తలెత్తుతున్న వేర్పాటువాదం

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో క్రమంగా వేర్పాటువాదం బలం పుంజుకొంటున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయిప్పుడు. ఇంతకు ముందు ఎప్పుడో ఏదో సందర్భంగా భారత వ్యతిరేక నినాదాలు వినిపించేవి. కానీ ఇప్పుడు చాలా తరచుగా శ్రీనగర్ లో వేర్పాటువాదులు భారత వ్యతిరేక బహిరంగసభలు నిర్వహిస్తూ, పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ వంటి కొన్ని వేర్పాటువాద సంస్థలు రాష్ట్ర యువతలో భారత వ్యతిరేక భావాలు నాటేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోందని హురియత్ సభలకు, ర్యాలీలకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే అర్ధమవుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే ఏదో ఒకనాడు పరిస్థితి చెయ్యి దాటిపోయే సూచనలు కనబడుతున్నాయి.

 

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పర్యాటక రంగానికి మరింత ప్రోత్శాహం కల్పించడం, సామాన్య ప్రజలకు లబ్ది కలిగేవిధంగా సంక్షేమ పధకాలను రూపొందించి వాటిని పటిష్టంగా అమలుచేయడం వంటి కొన్ని చర్యలతో పాటు వేర్పాటువాదుల పట్ల చాలా కటినంగా వ్యవహరించగలిగితే మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి రావచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఈ వేర్పాటువాదాన్ని మట్టుబెట్టవచ్చును.

 

కానీ అంతకంటే చాలా భయంకరమయిన సమస్య భారత్ కి సవాలు విసరబోతోంది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 16 కార్పస్, లెఫ్టినెంట్ జనరల్ కె.హెచ్. సింగ్ మీడియాతో మాట్లాడుతూ “మాకు అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 200-225 మంది ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు మకాం వేసినట్లు తెలుస్తోంది. పీర్ పించల్ అనే ప్రాంతంలో మొత్తం 36 క్యాంపులున్నట్లు మాకు సమాచారం అందుతోంది. వారు వీలువెంబడి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చును,” అని తెలిపారు.

 

ఇరాక్, సిరియా తదితర దేశాలలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఎంత కిరాతకంగా సామూహిక హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారో నిత్యం అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి భయంకరమయిన కరడుగట్టిన ఉగ్రవాదులు ఇప్పుడు మన గుమ్మం వరకు వచ్చేసారని వింటేనే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇంతవరకు భారత ప్రభుత్వం వేర్పాటువాదులపట్ల, పాకిస్తాన్ తీవ్రవాదులపట్ల చాలా సహనంగా వ్యవహరించింది. కానీ ఇకపై చాలా గట్టిగా స్పందించవలసిన సమయం ఆసన్నమయినట్లు కనబడుతోంది. ఇటీవల భారత కమెండోలు పొరుగునున్న మయన్మార్ దేశంలోకి ప్రవేశించి నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లే ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి తిష్ట వేసుకొని ఎదురు చూస్తున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులను మట్టుబెట్టవలసి ఉంటుందేమో. లేకుంటే వారే భారత్ లోకి ప్రవేశించి అదును చూసి భయంకర విద్వంసానికి పాల్పడే ప్రమాదం ఉంది.