జూన్ 2 తరువాత విజయవాడ నుండే పాలన

 

రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి పదహారు నెలలు పైనే అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న శాఖల్లో కొన్ని శాఖలు విజయవాడకు తరలిపోయాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 2 నుండి ఎట్టి పరిస్థితిల్లోనూ విజయవాడనుండే పాలన సాగించాలని అధికారులకు సూచించడంతో ఆదిశగా ఉద్యోగులను సమాయత్తపరిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా మంగళవారం ఒక సర్కులర్ జారీ చేశారు. దీనిలో ఆయన ఉద్యోగులందరికీ మూడు ఆప్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  అవి నవంబర్‌ 30 లోపు ఎవరెవరు వెళ్తారు? వచ్చే ఫిబ్రవరి ఆఖరుకు ఎవరు వెళ్తారు? జూన్‌ 1 నాటికి ఎవరు వెళ్తారు? అని అందులో అడిగారు. అందరూ ఒకేసారి వెళ్లడం కంటే..దశలవారీగా వెళితేనే బావుంటుందని.. అక్కడ ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాడు చేయడానికి కూడా వీలుంటుందని తెలుపుతూ.. నెలాఖరులోపు వివరాలు అందజేయాలని సూచించారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా మీనా జారీ చేసిన సర్కులర్ పై సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవిధంగా ఆప్షన్లు ఇస్తే కష్టమని అందరికి, గందరగోళం తలెత్తుతుందని..సచివాలయం మొత్తానికి ఒకే రకమైన పద్ధతిని అమలు చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. మొత్తానికి వచ్చే ఏడాది నుండి పరిపాలన మొత్తం విజయవాడనుండే జరగబోతుందన్నమాట.