చంద్రబాబు వెళ్లనిది అందుకేనా?
posted on Jun 30, 2015 11:04AM
రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత ఉమ్మడి రాజధాని గా ఉన్న హైదరాబాద్ లో ఉండే సీఎం చంద్రబాబు పరిపాలనా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీ లో సీఎం క్యాంపు కార్యలయానికి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.. అవి పూర్తవడానికి ఇంకా సమయం పడుతుంది. అప్పటి వరకూ ఇక్కడ కొన్ని రోజులు.. అక్కడ కొన్ని రోజులు ఉండి పరిపాలన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ భారత విడిది సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తనకు అతి దగ్గరగా ఉన్నా కూడా రాష్ట్రపతికి స్వాగతం పలకలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది చంద్రబాబు.
భారతదేశ ప్రధమ పౌరుడైనటువంటి రాష్ట్రపతి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయనకు సైనిక స్వాగతం ఉంటుంది. అలాగే ఈసారి కూడా హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో విమానం దిగగానే సైనికాధికారి సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా తదితరులు పాల్గొంటారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వెళ్లవచ్చు కానీ ఇప్పుడు వెళ్లలేని పరిస్థితి వచ్చింది చంద్రబాబుకి. గతంలో ఒకసారి రాష్ట్రపతి ఇక్కడికి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఆయన దిగారు. అప్పుడు సైనికాధికారి.. గవర్నర్.. తెలంగాణ సీఎం.. ఆ తర్వాత చంద్రబాబు స్వాగతం పలికారు. ఎందుకంటే బేగంపేట విమానాశ్రయం రాజధాని ప్రాంతమైన జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. దాంతో తెలంగాణ సీఎంకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఏపీ సీఎంకి తదుపరి ప్రాధాన్యం కల్పించారు. కానీ ఈసారి సీన్ మారిపోయింది. రాష్ట్రపతి ల్యాండింగ్ కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని హకీంపేటలో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఒకవేళ ఆయన అక్కడికి వెళ్లినా పొరుగు రాష్ట్రం హోదా కింద వస్తుందని.. తెలంగాణ సీఎంతో సమానంగా అధికార మర్యాదలు ఉండవని ఆలోచించి స్వాగత కార్యక్రమానికి వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాగా తానే స్వయంగా బొల్లారంలోని రాష్ట్రపతి విడిదికి వెళ్లి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది.