చిరంజీవి 150 సినిమా చేస్తే మరి ప్రజలు, కాంగ్రెస్ సంగతి?
posted on May 12, 2015 11:42AM
ఇప్పడు అందరూ చిరంజీవి 150 సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ఆ సినిమా గురించి ట్వీటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో చాలా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో కూడా అదే చర్చ. కానీ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పూర్తి సమయం వెచ్చించకుండా ఈవిధంగా సినిమాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం? ఈ ప్రశ్న ఆయన వంటి పార్ట్ –టైం రాజకీయ హీరోలందరికీ కూడా వర్తిస్తుంది. ఆయన అసలు రాజకీయాలలోకి రాకుండా సినీ పరిశ్రమలోనే కొనసాగుతూ ఆ సినిమాను తీస్తున్నట్లయితే ఆయనను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. లేదా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి సినిమాలు చేసుకొన్నా ఎవరూ అడిగేవారు కాదు.
తమ సినిమాలలో ప్రజల సంక్షేమం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి కాశీకి వెళ్ళిపోగల చిరంజీవి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన సినిమాలు త్యాగం చేయలేరా? రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. రాష్ట్రం మళ్ళీ నిలద్రోక్కుకొని లేచి నిలబడాలంటే కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి కొన్ని అంశాలలో చాలా జాప్యం జరుగుతోంది. కనుక రాష్ట్రానికి చెందిన ప్రతీ ఒక్క యంపీ కూడా పార్టీలకి అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఏదో మొక్కుబడిగా పార్లమెంటు సమావేశాలలో పాల్గొనడమే తప్ప ఏనాడు వాటి గురించి కేంద్రాన్ని అడిగింది లేదు. కనీసం సమావేశాలకు హాజరయిందీ లేదు. ఎందుకంటే ఆయన తన 150 సినిమా నిర్మాణం గురించి చాలా బిజీగా ఉన్నారు.
పార్లమెంటుకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి లేదా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడక పోయినా కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ కోసం గుంటూరులో చేసిన ఒక్కరోజు దీక్షకు మాత్రం ఎందుకో హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా లభించే అన్ని సౌకర్యాలను నిరభ్యంతరంగా వాడుకొంటున్న చిరంజీవి మరి ప్రజా ప్రతినిధిగా తన విధులను ఎందుకు నిర్వర్తించడం లేదు? అని ప్రశ్నిస్తే ఆయన వీరాభిమానులకు చాలా కోపం రావచ్చును. ఇంతకు ముందు సినిమాలు మాత్రమే చేసుకొంటున్నప్పుడు ఆయనను ఎవరూ ఇటువంటి ప్రశ్న అడగలేదు. కానీ ఆయన ఇప్పుడు ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా జీతభత్యాలు, సకల సౌకర్యాలు పొందుతున్నప్పుడు ఆయనకు ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో అప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.
ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా, రాజకీయాలలో తనకీ స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకొని ఉన్నా బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దానిని గాలికి వదిలి తన 150 సినిమా చేసుకొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆయన వంటి అత్యంత ప్రజాధారణ కలిగిన వ్యక్తి మరొకరు కనబడకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనకే ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే సంగతి పక్కన పెడితే, ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చాలా దయనీయంగా మారిన తన పార్టీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నించకుండా తన 150వ సినిమా చేసుకోవడానికి వెళ్ళిపోయారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అప్పుడు కూడా ఆయన పార్టీని ఇదేవిధంగా వదిలిపెట్టి ఉండేవారా? అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. కనుక ఆయన ఒకవేళ మళ్ళీ సినిమాలలో నటించదలచుకొంటే రాజకీయాలకు స్వస్తి పలికితే మంచిది. లేదా రాజకీయాలలో కొనసాగాలనుకొంటే, తన పూర్తి సమయం ప్రజా సేవకే వినియోగించినా అందరూ హర్షిస్తారు. కానీ ఈవిధంగా పార్ట్-టైం ప్రజాసేవ వలన ఇటువంటి విమర్శలకు తావిచ్చినట్లవుతుంది.