బాలకార్మికులకు రక్షణ కవచం

దేశాన్ని పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ప్రధానమైంది. స్వాతంత్ర్యం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడుస్తున్నా నేటికి మన సమాజంలో బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరం. తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత ఒకవైపు, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవచ్చునని యాజమాన్య దోపిడి పెరిగిపోవడం బాలకార్మిక వ్యవస్థ మరింత పెరగడానికి దోహదం చేస్తున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 25.2 కోట్ల మంది పిల్లలున్నారు. వీరిలో సుమారు 1.26 కోట్ల మంది బాల కార్మికులున్నట్లు అంచనా.

 

నానాటికి పెరిగిపోతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత రాజ్యాంగంలోని 24, 39, 45వ అధికరణలు పిల్లలకు శ్రమ దోపిడీ నుంచే కాకుండా ఇతర రక్షణలనూ కల్పిస్తున్నాయి. 1986లో చేసిన బాల కార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం నోటిఫై చేసిన ప్రమాదకర వృత్తుల్లో బాలకార్మికలుండటాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. అయితే బాలకార్మికులను ఎంతగా విడిపిస్తున్నప్పటికి వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ఈ దురవ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది.

 

14 ఏళ్లలోపు పిల్లలకు పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ రూపోందించిన బిల్లును రాజ్యసభ మూజు వాణి ఓటుతో ఆమోదించారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి విధించే జైలుశిక్ష, జరిమానాను పెంచారు. కొత్త బిల్లు ప్రకారం 14 ఏళ్ల లోపువారిని పనిలో పెట్టుకుంటే ఆ సంస్థ యజమానిపై కేసు నమోదు చేస్తారు. తల్లిదండ్రులపైనా జరిమానా విధిస్తారు. గతంలో మూడు నెలల నుంచి ఏడాది పాటు విధించే శిక్షను తాజాగా ఆరు నెలల నుంచి రెండేళ్లకు పెంచారు. జరిమానా సైతం గతంలో ఉన్న రూ.10-20 వేల నుంచి రూ.20-50 వేలకు పెంచారు. కేసు తీవ్రతను బట్టి పై రెండూ ఒకేసారి విధించవచ్చు.