అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్

 

వైద్యో నారాయణో హరి: అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం. ఆ చెన్నై డాక్టర్లు కూడా సాక్షాత్తూ దేవుళ్ళే. ఆ చెన్నై డాక్టర్టు అరుదైన రికార్డు సృష్టించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుతం సాధించారు. చెన్నైలోని మలార్ ఆస్పత్రిలోని 42 సంవత్సరాల వ్యక్తి గుండె పూర్తిగా పాడైంది. అతనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. బెంగుళూరులో ఒక బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను అతనికి అమర్చాదని డాక్టర్లు నిర్ణయించారు. అయితే ఆమె చనిపోయింది బెంగళూరులో. అతను వున్నది చెన్నైలో. ఆమె నుంచి గుండెను సేకరించిన కొద్ది నిమిషాల్లోనే ఇతనికి అమర్చాల్సి వుంటుంది. ఆ ప్రక్రియ ఆలస్యమైతే ఏ ఉపయోగమూ వుండదు. డాక్టర్లు క్షణం ఆసల్యం చేయలేదు. చెన్నై, బెంగళూరు వైద్యులు చకచకా స్కెచ్‌ గీశారు. పోలీసుల సహకారం కోరారు. విమానం సిద్ధం చేశారు. సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు ఆమె నుంచి గుండెను స్వీకరించారు. మరో పది నిమిషాల్లో అంటే 3 గంటల 25 నిమిషాలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి గుండెను తీసుకొచ్చారు. ప్రత్యేక విమానం గంటసేపట్లో చెన్నైకి చేర్చింది. సరిగ్గా 4.25కి చెన్నై ఎయిర్‌ పోర్ట్‌కి గుండె చేరింది. అంబులెన్స్ 12 కిలోమీటర్ల దూరంలో వున్న మలార్‌ ఆస్పత్రికి కేవలం పది నిమిషాల్లో గుండె చేరింది. ఈ దారిలో 13 సిగ్నల్స్‌ వున్నప్పటికీ ఎక్కడా ఏ ఆటంకం రాకుండా చెన్నై పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరి కృషి ఫలించింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఓ నిండు ప్రాణం నిలబడింది.