లక్ష కోట్లకు పైగా విలువజేసే భూములపై వైసీపీ పెద్దల కన్ను.. ఇదేనా కోతలరాయుని పాలన?

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైసీపీ విమర్శలు గుప్పించారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని మండిపడ్డారు.

"మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇక, సీఎం వైస్ జగన్ ని కోతలరాయుడుతో పోలుస్తూ.. ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శలు చేశారు.

"వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆరోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి... 'మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను.' అన్నాడంట. ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?" అంటూ జగన్ సర్కార్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.