మంగళసూత్రం మింగేసిన దొంగోడు
posted on Apr 30, 2015 11:53AM
ఓ చైన్ స్నాచర్ తాను దొంగిలించిన మంగళసూత్రాన్ని మింగేసి కష్టాల్లో పడ్డాడు. ముంబైలో ఓ చైన్ స్నాచర్ ఒక మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలోంచి మంగళసూత్రాన్ని తెంపుకుని పారిపోయాడు. అయితే పోలీసులు వెంట పడటంతో దొరికిపోతాననే భయంతో తాను తెంచిన మంగళసూత్రాన్ని నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. అయితే 25 గ్రాముల బరువున్న ఆ మంగళ సూత్రం నేరుగా పొట్టలోకి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఇరుక్కుపోయి, అక్కడి నుంచి కదలని డిసైడైంది. సదరు దొంగగార్ని పట్టుకున్న పోలీసులు అతను మంగళసూత్రాన్ని మింగిన విషయాన్ని గ్రహించి అతనికి అరటిపళ్ళు తినిపించడం, పళ్ళరసాలు ఇవ్వడం లాంటి పనులన్నీ చేశారు. అయితే ఆ మాంగల్యం చాలా గట్టిదేమో, పేగుల్లో ఎక్కడ ఇరుక్కుండో అక్కడే గట్టిగా వుండిపోయింది. దాంతో ఆ దొంగకి కడుపునొప్పి మొదలైంది. బాధతో కేకలు వేస్తూ వుండటంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ గొలుసును బయటకి తీయాలని నిర్ణయించారు.