క్యాబేజీ... ఖావోజీ...

 

క్యాబేజీ అనగానే మొహం చిట్లిస్తారు చాలామంది. రుచిగా వుండదని దూరంగా పెడతారు. అది ఉడికేటప్పుడు వచ్చే వాసన కూడా నచ్చడు చాలామందికి. కానీ, క్యాబేజీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇందులో ఎన్నో పోషకాలు వున్నాయని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు. పైగా ఇందులో కేలరీలు చాలా ఎక్కువ.


పోషకాలు ఎక్కువే:-

క్యాల్షియం, ఐరన్, అయోడిన్, పొటాషియం, సల్ఫర్, ఫాస్పరస్ వంటివి క్యాబేజీలో సమృద్ధిగా వుంటాయి. ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ ‘ఎ’ నుంచి ‘బి’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ఫోలిక్ యాసిడ్లు ఇందులో ఎక్కువగానే వుంటాయి.


యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఎక్కువ:-

క్యాబేజీకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు వున్నాయి. అందుకే అమెరికన్ క్యాన్సర్ సంస్థ అత్యుత్తమ స్థాయిలో సిఫారసు చేసిన కూరగాయల్లో క్యాబేజీ  ఒకటి. ఇందులో యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్లకు కొదవే లేదు. ఆరోగ్యంగా వుండాలంటే మన శారీరక వ్యవస్థ బాగా పనిచేయాలి. అందుకు ఉపయోగపడే ఫిటో న్యూట్రియెంట్లు క్యాబేజీలో చాలా ఎక్కువ వున్నాయిట. ఇవి క్యాన్సర్‌కి కారణమయ్యే హార్మోన్లతో పోరాడే యాంటీ బాడీల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి క్యాబేజీని పచ్చిగా లేదా కొద్దిగా ఉడికించి వారానికి రెండుమూడుసార్లు తిన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువని గుర్తించారు. కేవలం క్యాన్సరే కాదు... గుండె ఆరోగ్యానికీ క్యాబేజీ మంచిదే. రుమటాయిజం, చర్మ సంబంధిత వ్యాధులకి క్యాబేజీ మంచి ఆహారంట.


బరువు తగ్గాలననుకునే వారికి దివ్య ఔషధం:-

బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకుంటే చాలు... ఆ పని అది చేస్తుంది. క్యాబేజీలో వుండే కొన్ని పదార్ధాలు చక్కెరలు, ఇతర కార్బో హైడ్రేట్లు కొవ్వుగా మారకుండా అడ్డుకుంటాయి.


వండే విధానం ముఖ్యం:-

* క్యాబేజీని ఎక్కువగా ఉడికించడం వల్ల కొన్ని పోషక విలువలు కోల్పోయే అవకాశం వుందిట. కాబట్టి క్యాబేజీని తక్కువ సమయం మాత్రమే ఉడికించాలి.

* అలాగే ఎప్పుడూ కుక్కర్లో ఉడికించకూడదు. దాని వలన మన ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. క్యాబేజీని ఉడికించేటప్పుడు మూత కూడా పెట్టకూడదు.


పోషకాలు పోకూడదంటే:-

క్యాబేజీని కొనేటప్పుడు ఎప్పుడైనాసరే పూర్తి క్యాబేజీనే కొనాలి. కోసి వున్నవి కొనకూడదు. ఒక్కసారి క్యాబేజీని కోశాక పోషక విలువలు తగ్గడం మొదలవుతుంది. ఎప్పుడైనా సగం కోసి వాడాల్సి వస్తే ఓ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో వుంచితే అందులోని పోషక విలువలు పోకుండా వుంటాయి.

-రమ