కంటి శుక్లం రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా తినాలి..!
posted on Nov 12, 2024 9:30AM
ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని, బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
కంటి శుక్లం..
చాలామంది చూపు కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది.. ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది. కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది. వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి. చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా, కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే..
కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది.
సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది.
ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది.
ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది. వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది.
ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.
రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు. దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు. లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు.
ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి.
*రూపశ్రీ.