బొత్స వైకాపాలో చేరబోతున్నారా?
posted on Apr 13, 2015 9:54AM
విజయనగరం జిల్లాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని వైకాపాలో చేర్చుకోవడం గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా నేతల అభిప్రాయం అడిగినట్లు వార్తలు వచ్చేయి. కానీ ఆ నాయకుడు ఎవరనే విషయం బయటకి పొక్కనీయలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలెవరూ వైకాపాలో చేరే ఆలోచన చేయరని ఎవరయినా చెప్పగలరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది కనుక ఆ పార్టీకి చెందిన నేతలే వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపుతుండవచ్చును.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖనేత అనగానే టక్కున గుర్తుకు వచ్చేది బొత్స సత్యనారాయణే. ఇదివరకు ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించి అది వీలుకకాకపోవడంతో నేటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఆయన ఇదివరకులా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్నా ఆయన తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పాల్గొంటున్నట్లున్నారు తప్ప ఇదివరకులా కాంగ్రెస్ పార్టీని వెనకేసుకురావడం లేదనే సంగతి గమనిస్తే ఆయన వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగకమానదు. విజయనగరానికే చెందిన వైకాపా నేత కోలగట్ల వీరభద్రరావుతో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. కనుక ఆయన ద్వారా బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ వైకాపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారేమో?
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైకాపాకు బలమయిన నాయకులే ఉన్నారు. ఒకవేళ బొత్సను వైకాపాలో చేర్చుకొంటే పార్టీ బలోపేతం అవడం సంగతి ఎలా ఉన్నా ఆయన వారందరి మీద పెత్తనం చేసే అవకాశాలున్నాయి. ఆయనతో బాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా వెంటవస్తారు కనుక క్రమంగా వారందరూ కలిసి జిల్లాలో పార్టీని తమ చెప్పు చేతల్లోకి తీసుకొనే అవకాశం కూడా ఉంటుంది. బహుశః అందుకే వైకాపా జిల్లా నేతలు తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు వెంటనే తలూపేయకుండా ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలనికోరారు. ఒకవేళ బొత్స సత్యనారాయణ కాక కాంగ్రెస్ పార్టీకి చెందిన వేరే నేతలేవరయినా అయ్యుంటే బహుశః వైకాపా నేతలు అభ్యంతరం చెప్పి ఉండేవారు కారేమో?