రెండేళ్ల క్రితం పోయిన బాబా! ఇంకా తిరిగి వస్తాడనుకుంటూ…

పంజాబులోని జలంధరుకి చెందిన ‘బాబా అశుతోష్‌ మహరాజ్’ ఈ లోకాన్ని విడిచిపెట్టి జనవరి 29 నాటికి రెండేళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఆయన చనిపోయారంటే మాత్రం ఆయన భక్తులు నమ్మేందుకు ససేమీరా అంటున్నారు. పైగా రెండేళ్లుగా ఆయన దేహం పాడుకాకుండా శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. ‘బాబా చనిపోలేదని నమ్మినప్పుడు ఈ శీతలీకరణ యంత్రాలు దేనిక’ని అడిగితే ‘ఆయనవంటి మహాత్ములకు హిమాలయాలలో తపస్సు చేసుకోవడం అలవాటు కదా. అందుకు!’ అని తడుముకోకుండా జవాబుని ఇస్తున్నారు భక్తులు. అశుతోష్‌ మహారాజ్ చనిపోయారని తాము నమ్మడం లేదనీ, ఆయన కేవలం సమాధి స్థితిలోకి వెళ్లారనీ, ఎప్పటికైనా లేచి కూర్చుంటారనీ భక్తులు మహా నమ్మకంగా ఉన్నారు. నిజానికి అశుతోష్‌ బాబా గుండెపోటుతో చనిపోయినట్లు ఆయన భక్తులైన కొందరు వైద్యులే తేల్చి చెప్పారు. కానీ ‘దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్‌’ పేరిట బాబా ఏర్పాటు చేసిన భక్త సంఘం మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. రోజులు గడుస్తున్నా బాబాగారు తిరిగి లేవకపోవడం, ఇతరులు ఎవ్వరూ లోపలికి రాకుండా భక్తులు ఆయన ఆశ్రమం దగ్గర కాపలా కాస్తుండటంతో… ఈ వ్యవహారం కాస్తా కోర్టు వరకూ వెళ్లింది. ఫిబ్రవరి 24న కోర్టు తన నిర్ణయాన్ని వినిపించబోతోంది. భక్తుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు ఊరుకుంటుందో లేక అంత్యక్రియలకు ఆదేశిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోపల బిహారుకి చెందిన ‘దలిప్‌ కుమార్‌ ఝా’ ఈ వివాదానికి ఓ కొత్త మలుపుని తీసుకువచ్చారు. తాను అశుతోష్‌కి కొడుకుననీ, కావలంటే డీఎన్ఏ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాననీ, ఆయనకి అంత్యక్రియలు చేసే అధికారం తనకే ఉందనీ దలిప్‌ కుమార్‌ వాదన!