టూరిస్ట్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్...

 

చంద్రబాబు జపాన్ పర్యటనలో భాగంగా మూడోరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం శానో నో స్టార్మ్ రిజర్వాయర్ని సందర్శించింది. అక్కడ వరద నిర్వహణ విధానాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘మన మార్కెట్లకు జపాన్ పెట్టుబడులు వస్తే అద్భుతాలు సాధించవచ్చు. నూతన రాజధాని, 13 స్మార్ట్ సిటీల నిర్మాణానికి సహకరించాలని జపాన్‌ ప్రభుత్వాన్ని కోరాం. ఆంధ్రప్రదేశ్‌ని టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం వుంది’’ అన్నారు. అంతకుముందు చంద్రబాబు బృందం ఫుఖువొకాలో పర్యటించింది. నకాటాలోని వ్యర్థాల నిర్వహణ ప్రాంగణాన్ని పరిశీలించి, వర్మీకంపోస్ట్, బయోగ్యాస్ ప్రాజెక్టుల వినియోగాన్ని అధ్యయనం చేశారు. ఫుఖువొకా టవర్ని సందర్శించిన బృందం ఆ టవర్ ప్రత్యేకతలను తెలుసుకుంది. ఈ బృందంలో మంత్రులు నారాయణ, యనమల, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులున్నారు.