అభివృద్ధి మంత్రం జపిస్తున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు

 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అంశాలపై కత్తులు దూసుకొంటునప్పటికీ, తమ తమ రాష్ట్రాలను పొరుగు రాష్ట్రం కంటే వేగంగా, ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలని పట్టుదలగా ప్రయత్నిస్తుండటం అభినందనీయం. వచ్చే ఎన్నికల నాటికి పొరుగు రాష్ట్రం కంటే తమ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపకపోయినా, సమస్యలను పరిష్కరించడంలో విఫలమయినా ప్రజలు తమ పార్టీని తిరస్కరించవచ్చనే భయం కూడా బహుశః వారిని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టేలా చేస్తున్నాయని భావించవచ్చును. కారణాలు, ఆలోచనలు ఏవయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాయి. ఆలోచిస్తున్నాయి. గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్రం ఆంద్ర పాలకుల చేతిలో దోపిడీకి, తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని గట్టిగా వాదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ఆంద్ర పాలకులకు, తమ పాలనకు మధ్య గల తీవ్ర వ్యత్యాసం చూపించాలనే ప్రయత్నంలో అన్ని వర్గాలను, ప్రాంతాల సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే తెలంగాణాలో అత్యధిక జనాభాగా ఉన్న యస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. తెలంగాణాను పట్టి పీడిస్తున్న తీవ్ర విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

వ్యవసాయానికి నీటి వసతి కల్పించేందుకు చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఇందిరా పార్క్ సమీపంలో ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఆకాశహర్మ్య నిర్మాణం చేయాలనే ఆలోచనలన్నీ పొరుగు రాష్ట్రంతో పోటీలో భాగంగానే భావించవచ్చును. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఇటువంటి ఆరోగ్యకరమయిన పోటీని హర్షిస్తారు.

 

మళ్ళీ పదేళ్ళ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే, రాజధాని నిర్మాణం దానితో బాటే రాష్ట్రాభివృద్ధి, అదే సమయంలో తన ఎన్నికల హామీలను, బడ్జెట్ లో ప్రకటించిన హామీలను కూడా అమలుచేసి తన సత్తా ఏమిటో ప్రజలకు చూపించాలని తపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాజధానికి ఓ రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. దేశంలో కెల్లా అత్యద్భుతమయిన, అత్యాదునికమయిన హంగులతో కూడిన రాజధానిని నిర్మించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు, దానికి ఎదురవుతున్న అడ్డంకులను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం వంటి భారీ కార్యక్రమాలను ఆయన పెట్టుకొన్నారు. ఈ రెంటివల్ల రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు లభిస్తే వ్యవసాయం కూడా గాడిన పడుతుంది.

 

రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే కొత్తగా భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నివారించడం చాలా అవసరమని గ్రహించిన ఆయన ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు ఆయన దేశ విదేశాలలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో వాటికి అవసరమయిన అనుమతులు మంజూరు చేస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అనుమతులు, విభజన చట్టంలో రాష్ట్రానికి హామీ ఇవ్వబడిన అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం ఆయన కేంద్రం ఒత్తిడి చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు బహుశః త్వరలోనే ఫలితాలు కనబడటం మొదలవుతాయని చెప్పవచ్చును.

 

ఈ ఐదేళ్ళలో ఈ పనులన్నీచేసి చూపగలిగినట్లయితే అవి ఆయన ప్రభుత్వ పనితీరుకి, సామర్ధ్యానికి గీటురాయిగా నిలుస్తాయి. దానివలన వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి తన అధికారం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు సాధ్యమయినంత వరకు ఈ పనులన్నిటినీ పూర్తిచేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఈవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ఒకదానికొకటి సహకరించుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరూ హర్షిస్తారు.