రాష్ట్రానికి భారీగా జపాన్ పెట్టుబడులు... పరిశ్రమలు
posted on Nov 25, 2014 8:13AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ దేశ పర్యటన ఆశించినట్లే రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూర్చే విధంగా సాగుతోంది. భారత్ లో సర్వసాధారణమయిన లంచగొండితనం, పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు చేయడంలో జరిగే జాప్యం కారణంగా భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తున్న జపాన్ దేశ పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు లేవని, వారు పరిశ్రమలు స్థాపించడానికి వస్తే వారికి తమ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జపనీయులు ఆర్ధిక,సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ వారికి బాష ప్రధాన అవరోధంగా ఉంది. అది గ్రహించిన చంద్రబాబు తనను కలిసేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు అర్ధమయ్యే విధంగా జపనీస్ బాషలోనే పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నూతన పారిశ్రామిక విధానాల గురించి వారు అర్ధం చేసుకోగలిగారు.
తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కేవలం వారం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు మంజూరు చేసి, భూమి, నీళ్ళు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశ్రామిక ప్రోత్సహాకాలు అందజేస్తుందని వారికి వివరించారు. వ్యవసాయ పరికరాలను తయారు చేసే ఎన్మార్ అగ్రికల్చరల్ మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్ అనే సంస్థ, విద్యుత్ మోటార్లు తయారు చేసే ఎన్‌ఐడీఈసీ సంస్థ యాజమాన్యాలతో సమావేశమయిన చంద్రబాబు బృందం వారి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమకు తగిన విధంగా సహకరిస్తే రాష్ట్రంలో తమ పరిశ్రమలను స్థాపించి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసి రాష్ట్రానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూర్చగల సత్తా కూడా తమకు ఉందని ఆ రెండు సంస్థల యాజమాన్యాలు చెప్పడం గమనిస్తే వారు రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు సంసిద్దంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. ఆయన బృందం జపాన్ పర్యటన ముగించుకొని వచ్చేలోగా మరిన్ని సంస్థల ప్రతినిధులను కలిసి వారిని కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తారు .
కొన్ని రోజుల క్రితం జపాన్ దేశం పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా జపాన్ పారిశ్రామిక వేత్తలలో నెలకొన్న అనుమానాలను తొలగించి, భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా భరోసా ఇస్తుండటంతో జపాన్ పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో , ప్రధాని మోడీతో తనకు, తన ప్రభుత్వానికి చక్కటి సంబందాలున్నాయనే సంగతిని కూడా వారికి తెలియజేయడం ద్వారా వారికి తన ప్రభుత్వంపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేసారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, ఆ దేశం వినియోగిస్తున్న అత్యాదునికమయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు బృందం అధ్యయనం చేస్తోంది. రాజధాని, రాష్ట్ర పునర్నిర్మాణం, స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం కూడా జపాన్ దేశ సహకారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలున్నందున జపాన్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తున్నట్లు కనబడుతోంది. కనుక చంద్రబాబు నాయుడు తన జపాన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత, జపాన్ పారిశ్రామిక సంస్థల బృందాలు కూడా రాష్ట్రానికి వచ్చి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.